వృద్ధులకు శాపంగా మారిన నెట్‌వర్క్.. చెరువు కట్టపై ఆసరా పెన్షన్ పంపిణీ

by  |
వృద్ధులకు శాపంగా మారిన నెట్‌వర్క్.. చెరువు కట్టపై ఆసరా పెన్షన్ పంపిణీ
X

దిశ, గార్ల : ఉమ్మడి వరంగల్ జిల్లా గార్ల మండలంలోని అనేక గ్రామాల్లో సెల్‌టవర్లు లేక ఉన్న వాటి నుంచి సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పోస్టాఫీసు నుంచి చెరువు కట్టల వద్దకు తరలుతోంది. సిగ్నల్ ఎక్కడ సరిగా వస్తుందో అక్కడికే వెళ్లి పోస్టాఫీసు అధికారులు ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మండలంలోని సీతంపేట గ్రామంలో పోస్టాఫీసు వద్ద నెట్‌వర్క్ సరిగా రాకపోవడంతో గార్ల పెద్దచెరువు కట్టపై ఆసరా పెన్షన్ పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో పెన్షన్ దారులు చెరువు కట్టవద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనీసం కూర్చునేందుకు సరైన వసతులు లేవని దీంతో తమతో పాటు వృద్ధులు అవస్థలు పడుతున్నారని పోస్ట్‌మెన్ అజయ్ తెలిపారు. అదే విధంగా శేరి పురం, మర్రిగూడెం గ్రామాల్లో పోస్టాఫీసులు ఉన్నా అక్కడ సిగ్నల్ లేక సీతంపేట గ్రామంలో వచ్చి రాని నెట్‌వర్క్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ సిగ్నల్ రాకపోతే ఆసరా పెన్షన్ దారులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అధికారులు ఐడియా సిమ్ కార్డు ఇచ్చారని, గ్రామంలో దాని సిగ్నల్ సరిగా రావడం లేదని పోస్టుఫీసు అధికారులు వెల్లడించారు. తమ సొంతంగా వేరే సిమ్ కార్డులో నెట్ బ్యాలెన్స్ వేసి బాధితులకు పెన్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టల్ కార్యాలయం వద్ద నెలనెలా సిగ్నల్ ఇబ్బందుల కంటే ఆసరా పెన్షన్ దారుల బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు వేయాలని, లేనిఎడల సరైన మొబైల్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసి పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల పెన్షన్ దారులు కోరుతున్నారు.


Next Story

Most Viewed