ప్రభుత్వానివన్నీ కాకి లెక్కలే.. జీపీ అధికారులకు ఆరెపల్లి సర్పంచ్ హెచ్చరిక..!

by  |
ప్రభుత్వానివన్నీ కాకి లెక్కలే..  జీపీ అధికారులకు ఆరెపల్లి సర్పంచ్ హెచ్చరిక..!
X

దిశ, నిజామాబాద్ రూరల్ : జిల్లా పంచాయతీ అధికారులు డిచ్పల్లి మండలం అరెపల్లి గ్రామ సర్పంచ్ కార్యాలయానికి విడుదల చేసిన నిధుల సర్క్యులర్స్‌పై సర్పంచ్ ఇరుసు మల్లేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ‘దిశ’తో చరవాణిలో సంభాషించిన ఆయన.. తన గ్రామపంచాయతీలో నిధులున్నట్టుగా చెప్పడం విడ్డూరమన్నారు.పంద్రాగస్టు వేడుకలు జరుపుకోడానికే గ్రామపంచాయతీలో నిధుల్లేక గ్రామ సెక్రటరీ టెంకాయ కూడా కొట్టవద్దని తనకు చెప్పారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జెండా ఎగుర వేయకుంటే గ్రామ పరిస్థితి ఏంటని తాను ప్రశ్నించినట్టు పేర్కొన్నారు.

అదేవిధంగా చరవాణిలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ గ్రామ పంచాయతీ నిధులపై చెప్పినవన్నీ కాకి లెక్కలు అన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల్లేక పారిశుధ్య కార్మికులకు, కారోబార్లకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వెల్లడించారు.పంచాయతీలో నిధులు ఉన్నట్లుగా కాగితాల రూపకంగా తెలపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సర్పంచ్‌‌తో పాటు వార్డు సభ్యులు పంచాయతీ పాలక సిబ్బంది గానీ నిధులు దుర్వినియోగం చేస్తే తాము ఎలాంటి చర్యలకైనా కట్టుబడి ఉంటామని తెగేసి చెప్పారు. ఆరెపల్లి గ్రామస్తులు అంతా కట్టుబడి ఉన్నట్టుగా.. గ్రామం కోసం ఎల్లవేళలా గ్రామస్తుల సహకారం తనకెప్పుడు ఉంటుందన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ.. కాగితాల రూపకంగా గ్రామపంచాయతీలో నిధులన్నట్టు పేర్కొనడం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు.

అదేవిధంగా ప్రభుత్వ అధికారులు తన సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని పంచాయతీ అధికారిని ప్రశ్నించినట్టు తెలిపారు. తన తల్లికి భార్యకు శస్త్రచికిత్స జరిగితే జిల్లా పంచాయతీ అధికారికి ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా తన సోదరి మరణం పట్ల అధికారులు సర్క్యులర్లో పేర్కొనడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో నిధులు లేవని ఇప్పటికీ చెప్తున్నానని, ఉన్నవి లేనట్టు లేనిది ఉన్నట్టు అధికారులు కాకి లెక్కలు చూపితే గ్రామస్థులు సహించబోరని జిల్లా పంచాయతీ అధికారులను హెచ్చరించినట్టు సర్పంచ్ స్పష్టంచేశారు. అవసరమైతే శనివారం గ్రామానికి వచ్చి గ్రామంలో జరిగిన అభివృద్ధి, మంజూరు చేసిన నిధులను రికార్డుల రూపంలో చూడాలని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ ఇరుసు మల్లేశ్ జిల్లా పంచాయతీ అధికారికి సూచించినట్టు తెలిపారు.

Next Story

Most Viewed