ఏపీలో సినిమా టికెట్ల రచ్చ.. ఇండస్ట్రీకి మళ్లీ నిరాశే..!

by  |
ap-govt
X

సినీ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతున్నది. టికెట్ల ధరలను నియంత్రించిన ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో వెనుకంజ వేసింది. టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఇచ్చింది. ఈ మేరకు టికెట్ల ధరను వారు నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో వసతులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల 130 థియేటర్లపై దాడులు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వాటిని సీజ్ చేశారు. దీంతో ఇటు ప్రభుత్వం.. అటు సినీ ఇండస్ట్రీ మధ్య దూరం పెరిగిపోయింది.

దిశ, ఏపీ బ్యూరో: సినిమా టికెట్ల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇతర అధికారులను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ పరిశీలన చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సమస్యను పరిష్కరించాలని కోరగా, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు. దీంతో వారు అసంతృప్తితో వెనుదిరిగారు.

రాష్ట్రంలో టికెట్ల ధరల తగ్గింపుపై చెలరేగిన వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ధరలు తగ్గింపుపై వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలు సినీ ఇండస్ట్రీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా తయారయ్యాయి. సమస్య నుంచి గట్టెక్కించాలని ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్‌తో పాటు 19 మంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై చర్చించారు. ఈ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందంటూ మంత్రి చెప్పడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు అసంతృప్తితో వెనుదిరిగారు.

కోర్టు సూచనల మేరకే నడచుకుంటాం

ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి పేర్ని నాని అన్నారు. ‘సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించాం. ఆ రోజే అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ రెన్యూవల్ చేసుకోవాలని చెప్పాం. అయినా పట్టించుకోలేదు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం’ అని మంత్రి వారితో తెలిపారు. ‘ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుంది. 130 సినిమా హాళ్లపై చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశాం. లైసెన్స్ లేని 22 థియేటర్లు మూసేశాం. 83 సీజ్ చేశాం, 23 థియేటర్లపై ఫైన్ వేశాం.’అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మేము హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని, ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని వివరించారు.

హీరోల వ్యాఖ్యలకు కౌంటర్లు

‘సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రుల్లారా మేము ట్యాక్స్ పేయర్స్. మీ లగ్జరీల కోసం మేము పన్నులు చెల్లిస్తున్నాం. అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి’ అంటూ హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘సినీ హీరోలు చెల్లించే ట్యాక్సులతో రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నారు అన్నారంటున్నారు. సిద్ధార్థ ఉండేది తమిళనాడులో. ఈ రాష్ట్రంతో ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఆయన కట్టే ట్యాక్సులు ఏమున్నాయి. మేము ఏ రకంగా బతుకుతున్నామో సిద్ధార్థకు ఏం తెలుసు? హీరో సిద్ధార్థ బహుశా సీఎం స్టాలిన్, అక్కడి మంత్రుల గురించి లేదంటే మోడీ గురించి అన్నారేమో అంటూ’ మంత్రి సెటైర్లు వేశారు. మరోవైపు జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాం. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా థియేటర్లు మూసివేయడానికి నాని ఏ ఊరులో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్క పెట్టారో తెలియదు అంటూ మంత్రి పేర్ని నాని పంచ్‌లు వేశారు.

కమిటీ నియామకం

టికెట్ల వివాదానికి సంబంధించి ఓ కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రెవెన్యూ, ఆర్థిక, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయ శాఖ సెక్రటరీలు సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరల వివాదంపై ఈ కమిటీ పరిశీలన చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.

ఇటీవల రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ టికెట్ ధరలను నిర్ణయించే అధికారాలను జేసీకి అప్పగించింది. అలాగే ప్రభుత్వాన్ని ఓ కమిటీ వేసి అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది.



Next Story