పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం నజరానా

by  |
PV Sindhu
X

దిశ, ఏపీ బ్యూరో: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నగదు బహుమానం ప్రకటించింది. కాంస్య పతకం సాధించినందుకు గానూ రూ.30 లక్షల నగదు ప్రోత్సాహంగా ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని ఇటీవలే జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2017–22 స్పోర్ట్స్‌పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారుపతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్యపతకం సాధించిన వారికి రూ.30 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు సింధుకు రూ.30 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు విజయంపై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని కొనియాడారు. పీవీ సింధు సాధించిన విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణ కోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లే ముందు సింధుతోపాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed