ఏపీ మంత్రిమండలిలో పలు తీర్మానాలు

by  |
ఏపీ మంత్రిమండలిలో పలు తీర్మానాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పిన నవరత్నాల అమలుకు ఏపీ మంత్రిమండలి భేటీ ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగా పలు పథకాలు నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో భేటీ అయిన ఏపీ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ బీమా సామాజిక భద్రతా పథకం, రేషన్ దుకాణాల ద్వారా నేరుగా ఇళ్లకే సన్నబియ్యం పంపిణీ, గిరిజనులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ పథకాలను అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణాలకు రూ.6,792.21 కోట్లు

వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏప్రిల్11,2019 నాటికి బ్యాంకులకు బకాయి పడ్డ డ్వాక్రా మహిళలకు నాలుగు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లించాలని బుధవారం భేటీ అయిన మంత్రిమండలి తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020–21 సంవత్సరానికి రూ.6,792.21 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 90 లక్షల మంది లబ్దిదారులకు రూ.27,169 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

జగనన్న విద్యాకానుక కోసం రూ.648.09 కోట్లు

సెప్టెంబరు 5న జగనన్న విద్యాకానుక ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 43 లక్షల మంది విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, నోట్, టెక్స్ట్ బుక్స్, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.648.09 కోట్లు వెచ్చించనున్నారు.

వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ్ ప్లస్ కు రూ.1863 కోట్లు

సెప్టెంబరు 1న వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ్ ప్లస్ కార్యక్రమం ద్వారా 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోష‌ణ్ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్ కింద గర్బవతులు, బాలింతలకు 6 నుంచి 36 నెలలదాకా, 36 నుంచి 72 నెలల వరకూ పౌష్టికాహారం అందించేందుకు ఏటా రూ.1863 కోట్లు వెచ్చించి 30 లక్షల మందికి లబ్ది చేకూర్చాలని పేర్కొన్నారు.

రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరాకు రూ.776 కోట్లు

డిసెంబరు 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు నేరుగా ఇళ్లకే అందించేందుకు రూ.776 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. 9,260 వాహనాలు కొనుగోలు చేసి వాటి ద్వారా సరఫరా చేస్తారు. ఈ వాహనాలను 60 శాతం సబ్సిడీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద అందజేస్తారు. పది శాతం లబ్దిదారుల వాటా, 30 శాతం బ్యాంకు రుణంతో వాహనాలను సమకూరుస్తారు. నిరుద్యోగ యువకులకు ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇస్తారు. ప్రతినెలా పదివేల ఆదాయం వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బియ్యం నాణ్యత విషయంలోనూ గతంలో కంటే మెరుగ్గా 25 నుంచి 15 శాతానికి నూకలు తగ్గుతాయి. రంగు మారినవి 6 నుంచి 1.5 శాతానికి తగ్గుతుంది. ఇలా సార్టెక్స్ చేయడం వల్ల కిలోకి రూ.1.10 నుంచి 1.30లకు ధర పెరుగుతుంది. పంపిణీ కోసం 10,15 కిలోల రీయూజబుల్ సంచులను అందిస్తారు.

వైస్సార్ బీమా కింద రూ.583 కోట్లు విడుదల

వైఎస్సార్ బీమా కింద సహజ మరణానికి రూ 2 లక్షలు, శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు చొప్పున 18 –50 ఏళ్ల వయసు మధ్యనున్నవారికి సామాజిక బీమా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ ఆమోదించింది. 51–70 ఏళ్ల మధ్యవారికి రూ.3 లక్షలు చెల్లించేట్లు పథకాన్ని రూపొందించారు. జీవిత బీమా సంస్థ, కేంద్రం గతంలో అమలు చేసే సామాజిక బీమా పథకాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.583.5 కోట్లు వెచ్చించి బియ్యం కార్డు కలిగిన సుమారు కోటీ 50 లక్షల కుటుంబాలకు బీమా కల్పించాలని నిర్ణయించారు.

నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం

నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్, రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్ల టర్నోవర్ అంచనా, రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేశారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సూత్ర ప్రాయ అంగీకారం తెలిపారు. పది వేల కోట్ల పెట్టుబడులతో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.

భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశకు రూ.3,669.95 కోట్ల వ్యయం కానుంది. ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు. 2025 నాటికి 12.18 ఎంపీటీఏ, 2040 నాటికి 67.91 ఎంపీటీఏ కార్గోను హ్యాండిల్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్ 2006 సవరణలపై ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. వ్యవసాయ రంగంలో తాజా పరిస్థితులపై చర్చించారు. 26 శాతం అధిక వర్షపాతం నమోదుతో సాగు విస్తీర్ణం 101 శాతానికి చేరిందన్నారు.

రూ.510 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 115 మెగావాట్ల చొప్పున అదనంగా రెండు యూనిట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ పోలిస్టేషన్ తో పాటు కొత్త పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు, జిల్లాకు 76 హోంగార్డు పోస్టులు మంజూరు చేయనున్నారు.

Next Story