యువగళం నవశకం సభ: విశాఖకు చంద్రబాబు, బాలకృష్ణ

by Disha Web Desk 21 |
యువగళం నవశకం సభ: విశాఖకు చంద్రబాబు, బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : యువగళం నవశకం సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతోపాటు అగ్రహీరో,బావమరిది నందమూరి బాలకృష్ణ సైతం కలిసి వచ్చారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలకు తెలుగుదేం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఈనెల 20న సాయంత్రం యువగళం-నవశకం బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. విశిష్ట అతిథులు నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరుకానున్నారు. ఇకపోతే యువగళం నవశకం బహిరంగ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. అక్కడ నుంచి భోగాపురంలోని రిసార్ట్‌కు రోడ్డు మార్గంలో వెళ్లారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు యువగళం సభా ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అయితే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలో భారీ ఏర్పాట్లు

తెలుగుదేం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన ఈ యువగళం పాదయాత్రను ఈనెల 18న ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఆగనంపూడి వద్ద ముగించారు. ఈ సందర్భంగా ముగింపు సభను టీడీపీ ఏర్పాటు చేసింది. లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభను టీడీపీ ఏర్పాటు చేసింది. విశాఖ, విజయనగరం రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించింది.యువగళం నవశకం సభ సందర్భంగా భోగాపురం నుంచి విశాఖ వరకు భారీ స్థాయిలో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు వెలిశాయి. ఉత్తరాంధ్రలో ప్రతి నియోజకవర్గంలోనూ కటౌట్లు, స్వాగతద్వారాలు దర్శనమిస్తున్నాయి. సభలో పాల్గొనేందుకు వచ్చే కార్యకర్తలు, నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీడీపీ యువగళం వాలంటీర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 250 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. 600 మందికిపైగా ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులు అయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీగా సభావేదిక ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ప్రకటనపై ఉత్కంఠ

ఇకపోతే సభలో ఉన్న చివరి వ్యక్తికి కనిపించేలా అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లను సైతం టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ సభ నిర్వహణకు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో 16 కమిటీలను ఇప్పటికే టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ టీంలు అన్నీ సభను సక్సెస్ చేసే పనిలో తలమునకలవుతున్నాయి. వేదికపై 600 మంది కూర్చునేలా..సభలో 6 లక్షల మంది కూర్చునేలా గ్యాలరీలు సిద్ధం చేసింది టీడీపీ. ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఈ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన ఉమ్మడిగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed