విభజన హామీలే మా ప్రధాన అజెండా : MP Bharat Ram

by Disha Web Desk |
విభజన హామీలే మా ప్రధాన అజెండా : MP Bharat Ram
X

దిశ, డైనమిక్ బ్యూరో : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విభజన హామీలే ప్రధాన అజెండాగా పోరాటం చేస్తామని లోక్‌సభ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టనున్నట్లు వెల్లడించారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల అమలు కోసం ఈ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 193 సెక్షన్‌ ప్రకారం నోటీసులు ఇచ్చి స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టనున్నట్లు వెల్లడించారు. ఈనెల 7నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మెుదలుకాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి వైసీపీ తరపున లోక్‌సభ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు.

సమావేశం ముగిసిన అనంతరం భరత్ రామ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ విభజన చట్టంలో కేంద్రం నాడు ఏవైతే అంశాలు పొందుపరిచిందో అవన్నీ అమలు చేయాలని పట్టుబడతామని... విభజన చట్టంలోని ప్రతీ హామీని రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని ఎంపీ భరత్ రామ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం నిధులు, రెవెన్యూ లోటు బడ్జెట్, రామాయపట్నం పోర్టు, వైఎస్ఆర్ కడప స్టీల్‌ ప్లాంట్‌ లాంటి పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు రాబడతామని లోక్‌సభ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి పలు అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని లోక్‌సభ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed