visakha: రూ.150 కోట్లు ఖర్చు... సగానికి పైగా అవినీతే!

by Disha Web Desk 16 |
visakha: రూ.150 కోట్లు ఖర్చు... సగానికి పైగా అవినీతే!
X

దిశ, ఉత్తరాంధ్ర: జీ 20 సదస్సు పేరిట మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తెన్నేటి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా రూ.10 రూపాయల ఖర్చు అయ్యే పనిని వెయ్యి రూపాయల పనిగా చూపించి షార్ట్ టెండర్‌ పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలో వేసిన రోడ్డులోనే కొత్తగా వేసినట్టు, గతంలో పూసిన రంగులపై తిరిగి రంగులు పూసినట్టు చూపి కోట్ల రూపాయలను కొల్లగొట్టారన్నారు.


సదస్సు పేరిట మొత్తం విశాఖ నగరాన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వచ్చిన అవకాశాన్ని జీవీఎంసీ పాలక పెద్దలు, అధికారులు దుర్వినియోగం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పనుల్ని కేవలం జాతీయ రహదారికి బీచ్ రోడ్డుకే పరిమితం చేశారని తెలిపారు. హడావుడి పనుల పేరిట టెండర్ నిబంధనలను పాటించకుండా, ఎటువంటి ఆడిట్ లేకుండా కోట్ల రూపాయలను కొల్లగొట్టారన్నారు. జీవీఎంసీ అధికారులు దుర్వినియోగానికి బీచ్ రోడ్‌లో తెన్నేటి పార్క్, సీత కొండల దగ్గర జరిగిన పెయింటింగ్ పనులు చిన్న ఉదాహరణ అన్నారు. ఈ రెండు చోట్ల సాధారణ పెయింటింగ్ పనులకు రూ. 30 లక్షల రూపాయలతో టెండర్ పిలిచిన అధికారులు నిజానికి అక్కడ రెండు లక్షల రూపాయల పనులే చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు.


నగరంలో మిగిలిన ప్రాంతాల్లో పెయింటింగ్‌కు మీటర్ కు రూ.500 లు ఖర్చు చేస్తున్న జీవీఎంసీ, తెన్నేటి పార్కు వద్ద సాధారణ పెయింటింగ్ పనులకు మీటర్కు లక్షన్నర వెచ్చించిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. పులి తల, రెక్కలు విప్పిన గద్ద, సింహం తల వంటి చిన్న సాధారణ బొమ్మలు వేసేందుకు తెన్నేటి పార్క్ దగ్గర 12.30 లక్షల ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందన్నారు. కేవలం 8 చిన్న చిన్న బొమ్మలకు 12 లక్షలు వెచ్చించారంటే జీవీఎంసీలో అవినీతి జీ 20 పేరిట ఎంత భారీగా జరిగిందో ఊహించవచ్చన్నారు. పదివేల రూపాయలతో పది పెయింట్ డబ్బాలు కొనిచ్చి ఏదైనా పాఠశాల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు పెడితే ఇక్కడ అంతకంటే అద్భుతమైన చిత్రాల వచ్చేవన్నారు. అందుకు విరుద్ధంగా కేవలం లక్షల రూపాయలను తినేయాలని తలంపుతో మసిపూసి మారేడు కాయను చేశారన్నారు. ఒక్కో సింహం, పులి తల పెయింటింగ్ ఖర్చు లక్షన్నర అంటే పేరు మోసిన పెయింటర్‌లే ఆశ్చర్యపోతున్నారని పీతల మూర్తి యాదవ్ వ్యాఖ్యానించారు.

పక్కనే ఉన్న సీతకొండ దగ్గర వేసిన ఐదు బొమ్మల ఖరీదు రూ.16 లక్షల రూపాయలు అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదన్నారు. ఎటువంటి సృజనాత్మకత లేని మామూలు పెయింట్‌తో వేసే సాధారణ బొమ్మలకు ఇంత వెచ్చించటం జీవీఎంసీ అధికారుల అత్యాశకు, అవినీతికి నిదర్శనమన్నారు. జీవీఎంసీ పాలకపక్ష పెద్దలు కూడా ఈ పనులను సమీక్షించకుండా గుడ్డిగా ఆమోదించేసి తమ వంతు వాటాలతో నగరానికి తీరని ద్రోహం చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మహావిశాఖ నగరపాలక సంస్థ, ఏపీ అర్బన్ గ్రీన్ సంస్థల ద్వారా చేసిన రూ. 150 కోట్ల రూపాయల ఖర్చుపై క్షుణ్ణంగా సమీక్ష జరపాలన్నారు. ఈ పనులన్నింటిపై నిశితంగా థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించి అవినీతి అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. జీ-20 సదస్సు జరుగుతుందని ముందు తెలిసినా చివరి నిమిషం వరకు స్పందించకుండా షార్ట్ టెండర్ల పేరిట కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన వారందరి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నగరపాలక సంస్థ ద్వారా రూ.150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి జి-20 సదస్సుకు మేయర్‌ను ఆహ్వానించకపోవడం మరో దారుణమన్నారు. నగరపాలక సంస్థ నిధులు, నగరపాలక సంస్థ అధికారుల సేవలను వినియోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సు, ఇప్పుడు జరుగుతున్న జీ20 సదస్సులో మేయర్‌కు ఆహ్వానం నిరాకరించి అవమానించడం గర్హనీయమన్నారు. మార్చిలో జరిగిన పెట్టుబడుల సదస్సు, ఇప్పుడు జరుగుతున్న జీ20 సదస్సుల పేరిట విశాఖ నగరపాలక సంస్థ, విశాఖపట్నం అభివృద్ధి సంస్థ, ఏపీ అర్బన్ గ్రీన్ ద్వారా చేసిన ఖర్చులు, పూర్తయిన పనులపై వారం రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం వివరాలను ప్రజల ముందు ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటానికి న్యాయ పోరాటానికి సిద్ధమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హెచ్చరించారు.


Next Story

Most Viewed