Apలో శ్రద్ధా వాకర్ లాంటి ఘటన.. కవర్‌లో కుళ్లిపోయిన మృతదేహం.. భార్యదేనా?

by Disha Web Desk 16 |
Apలో శ్రద్ధా వాకర్ లాంటి ఘటన.. కవర్‌లో కుళ్లిపోయిన మృతదేహం.. భార్యదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఏదో ఒక మూల మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్‌ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. మధురవాడలో తాళం వేసి ఉన్న అద్దె ఇంట్లో ఉంచిన డ్రమ్‌లో ఓ మహిళ శరీర భాగాలు ఉండటం ఒక్కసారిగా కలకలం రేపింది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఒక ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఆ తర్వాత దానిని డ్రమ్‌లో పెట్టి సీల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన హౌస్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన విశాఖ వాసులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ దారుణ హత్య దాదాపు ఏడాది క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేసినట్లు తెలుస్తోంది.

మృతురాలు భార్యేనా?

వివరాల్లోకి వెళ్తే.. మధురవాడ వికలాంగుల కాలనీలో నండూరి రమేశ్‌కు ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఓ వెల్డర్‌ అద్దెకు తీసుకున్నాడు. అద్దె సకాలంలో చెల్లిస్తూ ఉండేవాడు. అయితే 2021 జూన్‌ నెలలో తన భార్య గర్భవతి అని ప్రసవానికి ఇంటికి వెళ్తుందని చెప్పాడు. ఆ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అనంతరం ఇంటికి రాకుండా తప్పించుకు తిరిగే వాడు. రెంట్ అడిగితే కొడుకు పుట్టాడని కూడా హౌస్ ఓనర్‌కి చెప్పాడు. అద్దె ఒకేసారి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో యజమాని నండూరి రమేశ్ ఓపిక పట్టారు. అయితే ఎంతకీ అద్దె చెల్లించకపోవడం.. చుట్టు పక్కల వాళ్లు శరీరం కుళ్లిన వాసన వస్తుందని చెప్పడంతో యజమాని ఇంటికి వచ్చాడు. తాళాలు పగులకొట్టి ఇంటిని పరిశీలించాడు.

అయితే ఒక ప్లాస్టిక్‌ డ్రమ్‌ ఉండటాన్ని గమనించాడు. ఆ డ్రమ్ తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన శరీర భాగాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఆ శరీర భాగాలు ఎవరివో కూడా గుర్తించే పరిస్థితి లేకుండా మృతదేహం కుళ్లి పోయింది. దీంతో ఇంటి యజమాని రమేశ్ పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ చేరుకుని ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. హత్య జరిగి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం అయి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం అద్దెకు ఉన్న వ్యక్తి భార్యదా? లేక వేరే మహిళదై ఉంటుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కుళ్లిన వాసన రాకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భార్యను హత్య చేసి ఇలా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి డ్రమ్‌లో పెట్టి సీల్ చేశారా లేక వేరే మహిళను ఇటీవలే హత్య చేసి అవయవాలను ఇలా చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed