మరో జాతీయ రాజకీయ పార్టీ పరాజయం: ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 16 |
మరో జాతీయ రాజకీయ పార్టీ పరాజయం: ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ,ఏపీ బ్యూరో: దక్షిణాదిలో జనాభా రీత్యా రెండో అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకలో మొన్ననే పూర్తయిన 16వ శాసనసభ ఎన్నికల ప్రక్రియ భారత ప్రజాస్వామ్యం పరిణతికి అద్దంపడుతోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. దాదాపు 6.76 కోట్ల జనాభా, 5,21,73,579 మంది అర్హత గల ఓటర్లు, 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్ణాటకలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ప్రచారకాలంలోగాని, పోలింగ్‌ సందర్భంగాగాని, ఫలితాలు ప్రకటించిన తర్వాత గాని రాజకీయ పక్షాల కార్యకర్తలు, అభిమానుల మధ్య జరిగిన కొట్లాటల్లో ఎవరూ మరణించలేదన్నారు.

రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్‌ నమోదైన 2018 అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్‌ జరిగింది. 2013లో 71.45%, 2018లో 72.1 శాతం పోలింగ్‌ నమోదైందనన్నారు. మే 10న జరిగిన తాజా ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్‌ జరిగి కొత్త రికార్డు చరిత్రకెక్కింది. అంటే కిందటి అసెంబ్లీ ఎన్నికల కన్నా 1.06% ఎక్కువ మంది కన్నడ ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 28 లోక్‌ సభ స్థానాలతో తమిళనాడు తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన కర్ణాటకది ఆర్థికాభివృద్ధి, సంపద సృష్టిలో కూడా తమిళ రాష్ట్రం తర్వాత స్థానంలో ఉందన్నారు. భారత సిలికాన్‌ వ్యాలీగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నేడు గ్లోబల్‌ సిటీ. మరి, ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే రాజకీయ చైతన్యం, భిన్న రాజకీయపక్షాల ఉనికి ఉన్న కర్ణాటకలో మొదటిసారి 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న జాతీయ రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ ఓడిపోయిందని గుర్తు చేశారు.

నాటి జనతా పార్టీ అనే జాతీయపక్షం అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అధికారంలో ఉన్న జాతీయ రాజకీయపక్షం ఓడిపోగా, పూర్వం కేంద్రంలో, రాష్ట్రంలో అనేక దశాబ్దాలు అధికారంలో కొనసాగిన మరో జాతీయ రాజకీయ పార్టీ పరాజయం పాలైందన్నారు. ఇలా, పారిశ్రామికాభివృద్ధి సాధించిన గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిరిగానే ప్రశాంతంగా జరిగే శాసనసభ ఎన్నికల్లో ఒక్కోసారి అధికారంలోని పార్టీలు ఓడిపోయి, సాఫీగా అధికార బదిలీ జరగడం గత నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రాల ప్రజల రాజకీయ చైతన్యానికి, భారత రాజకీయ, ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనంగా భావించవచ్చన్నారు.

Next Story

Most Viewed