రూ.260 కోట్లతో అమరావతిలో వెంకన్న ఆలయ విస్తరణ, నేడే భూమిపూజ

by velandi.Saikiran |

10:30 గంట‌ల‌కు చంద్రబాబు నాయుడు భూమి పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దాదాపు 3,000 మంది

రూ.260 కోట్లతో అమరావతిలో వెంకన్న ఆలయ విస్తరణ, నేడే భూమిపూజ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అమరావతిలో వెంకటేశ్వర ఆలయ విస్తరణకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి కృష్ణా నది తీరంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రెండు దశల్లో ఏకంగా రూ. 260 కోట్లతో అభివృద్ధి కార్య క్రమాన్ని చేపట్టనుంది. ఇక ఈ తరుణంలోనే ఇవాళ ఆలయ విస్తరణ పనులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ కూడా చేయబోతున్నారు.

ఇవాళ ఉదయం 10:30 గంట‌ల‌కు చంద్రబాబు నాయుడు భూమి పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దాదాపు 3,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని, భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆలయ విస్తరణ ప్రణాళిక ప్రకారం మొదటి దశలో దాదాపు రూ. 140 కోట్లతో పనులు చేపట్టనుంది ప్రభుత్వం. ఇందులో రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం నిర్మించబోతున్నారు. ఇక రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులను ఏపీ కూటమి ప్రభుత్వం చేప‌ట్ట‌నుంది. రెండో దశలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లుగా ఆలయ మాడవీధులు నిర్మించబోతున్నారు.

ఈ ఆలయానికి చేరుకునే అప్రోచ్ రోడ్లు, భక్తుల కోసం భారీ అన్నదాన కాంప్లెక్స్ లు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజ గోపురం, సేవా మండపం, పంచ ముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, విశ్రాంతి భవనం, పుష్కరిణీ, రత మండపం లాంటి భవనాల పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. అంతేకాదు అర్చకులు, ఆలయ సిబ్బంది నివాసం కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు ఉండేలా క్యార్ట‌ర్లు నిర్మిస్తారని టాక్. ఆలయానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ధ్యాన మందిరం అలాగే పరిపాలన భవనం కూడా నిర్మించనున్నారు.

Next Story