రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: పవన్ కల్యాణ్

by Disha Web Desk 12 |
రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని తాను బెజవాడ కనకదుర్గమ్మను వేడుకున్నట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.

అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. పవన్ కల్యాణ్‌కి, మనోహర్‌కి ఆలయం మర్యాదలతో ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, వేద పండితులు సైతం ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ కి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా వేదపండితులతో కలిసి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి ప్రచార రథం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే లక్ష్యంగా వారాహి ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చానని... తొలుత తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి ఆలయంలో వారాహికి పూజలు నిర్వహించినట్లు అభిమానులకు తెలిపారు.

విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదన్న పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ కల్యాణ్ అక్కడ నుంచి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి బయలుదేరారు. ఇకపోతే పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్‌కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. పవన్ కల్యాణ్‌కు వారాహికి గజమాల వేసి సత్కరించారు. ప్లై ఓవర్ పై నుంచి పవన్‌ కల్యాణ్‌పై పూల వర్షం కురిపించారు.



Next Story

Most Viewed