నేలకొరిగిన మహా వృక్షాలు

by Disha Web Desk 9 |
నేలకొరిగిన మహా వృక్షాలు
X

పచ్చని చెట్లు నేలకొరుగుతున్నాయి. వేలేరుపాడు బుట్టాయగూడెం మండల సరిహద్దు చిట్ట మోదేలు గ్రామంలో వందల సంఖ్యలో భారీ వృక్షాలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కూడా సక్రమంగా లేని ఈ మారుమూల గ్రామంలో అక్రమార్కులు తిష్టవేసి ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అటవీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా పంచాయతీ శివారు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోదేలు గ్రామానికి నేటికీ సరైన సదుపాయాలు లేవు. కాలిబాటన కొయిదా నడిచి వెళ్ళాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. అక్కడ నుంచి లంకపాకల గ్రామం వరకు పది కిలోమీటర్ల మేర నడిచి వెళ్తే ఆటో రవాణా సౌకర్యం ఉంటుంది. డోలు గండి గ్రామం నుంచి మోదేలుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా చెట్లను ఇటీవలే కొంతమంది నరికివేశారు.

దారి పొడవునా నరికిన వృక్షాలు చిగురించిన మోడ్లు, ఎండిన కొమ్మలు కలప గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కొండతంగేడు, ఏగేసా, కొడిచి, రాతియండి, కొండమామిడి, నల్లమద్ది, రేవడి, కరక, గరుగుడు, పలు రకాల జాతులు ఉన్నాయి. అడవిలో చిన్న కలప కొట్టిన నిరంతరం అడ్డుకునే అటవీ శాఖ అధికారులు వందల సంఖ్యలో మహావృక్షాలు నరికి నెలలు గడిచినా ఆలస్యంగా స్పందించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జేసీ పర్యటన తర్వాత వెలుగులోకి

ప్రస్తుతం బదిలీ అయిన జేసీ పి.అరుణ్ బాబు మారుమూల వేలేరుపాడు బుట్టాయగూడెం సరిహద్దు ప్రాంతం అయిన కొయిదా గ్రామాన్ని గత నెల 28న సందర్శించారు. డోలుగండి నుంచి మోదేలు గ్రామానికి వెళ్లే దారి పొడవునా చెట్ల నరికి వేయడంపై విచారణకు ఆదేశాలిచ్చారు. ఇటీవలే రాజమహేంద్రవరం ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో త్రిమూర్తులురెడ్డి కూడా తనిఖీ చేశారు. నరికివేసిన చెట్లను గుర్తించి లెక్కించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు.

సంబంధిత అటవీశాఖ సిబ్బంది చెట్ల వివరాలు నమోదు చేస్తూ నరికిన కలపను ఒక చోటికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. విద్యుత్తు లైను పేరుతో చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు ఇంతకాలం ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెట్ల నరికివేతపై స్థానిక గిరిజనులపై కావాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

విద్యుత్ సౌకర్యానికి మోకాలడ్డు

2021లో డోలుగండి నుంచి మోదేలు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం అనుమతులిచ్చింది.రూ.70 లక్షల నిధులు మంజూరు చేసింది. విద్యుత్తు శాఖ అధికారులు 6.3 కేవీ సామర్థ్యంతో బుట్టాయగూడెం మండలం రేపల్లె నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ వేసేందుకు సర్వే చేశారు. అయితే, ఆ ప్రదేశం జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీ రేంజ్‌ల పరిధిలోకి వస్తుంది. రెండు రేంజీల పరిధిలో అనుమతుల కోసం ప్రయత్నాలు చేసిన వారికి ఫలితం లభించలేదు.

రహదారి ఇరువైపులా ఉన్న అటవీ ప్రాంతం జంగారెడ్డిగూడెం కుకునూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నడంతో పెద్ద చెట్లు ఉండటంతో అటవీ శాఖ అధికారులు అనేక ఆటంకాలు కల్పిస్తూ నేటికీ పనులు జరగకుండా నిలిపివేశారు. మరి ఎటువంటి అనుమతలు తీసుకొని అక్రమార్కులు చెట్లను నరికి తీసుకువెళ్తున్నారో అటవి అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Also Read..

నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి.. నేడో, రేపో బాధ్యతల స్వీకరణ



Next Story

Most Viewed