దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు

by Disha Web Desk 21 |
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈవో కె.ఎస్‌.రామారావు, ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ యస్‌.ఢిల్లీరావు, పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు గవర్నర్‌ దంపతులతోపాటు ఉన్నారు. గవర్నర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో చైర్మన్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రంను అందించారు. ఇకపోతే ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. మెుదటి రోజైన ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. దేవీశరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

భారీ ఏర్పాట్లు

దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. అలాగే కొండచరియలు విరిగిపడిన దగ్గర గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. 3500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం అందిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు పాలు , మజ్జిగ , బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృద్ధులకు ఉదయం, సాయంత్రం రెండు స్లాట్లు ఉంటాయని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.



Next Story

Most Viewed