YCP: రెపరెపలాడిన వైసీపీ జెండా... ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

by Disha Web Desk 16 |
YCP: రెపరెపలాడిన వైసీపీ జెండా... ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. వైసీపీ ఆవిర్భవించి12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఇలా నేతలు వైసీపీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ఆవిర్భాం.. వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అంతేకాదు నిరుపేదలకు పండ్లు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.


వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి : సజ్జల రామకృష్ణారెడ్డి

12 ఏళ్ళుగా వైఎస్ జగన్ పార్టీని ఎంతో ఆదర్శవంతంగా నడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై పోరాటాలు..నిరంతరం ప్రజలతో మమేకమైన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజల మెచ్చేపాలన అందిస్తున్న మెనగాడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. సచివాలయ వ్యవస్ధతో పరిపాలనను ప్రజల ఇంటి ముందు నిలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అధికారం అంటే బాధ్యత, సేవ అని చాటిచెప్పిన నేత వైఎస్ జగన్ అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి లేదు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అని చెప్పారు. అందుకే వైసీపీకి ఓటమి ఉండదు. ఒక జీవప్రవాహం లాగా ముందుకు వెళ్తుందని సజ్జల తెలిపారు. చంద్రబాబు లాంటి వారు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా ప్రజల్లో నుంచి వైసీపీని ఏమాత్రం కదిలించలేరన్నారు. ముఖ్యంగా సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయని, చంద్రబాబు, ఇతర శక్తులు ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని చేస్తాయన్నారు. మారీచులుగా పథకాలు పన్నుతారని, మనకు కొన్ని కష్టాలు ఉన్నాయని, అయినా ప్రజల కష్టాలే మన కష్టాలుగా భావిస్తున్నామన్నారు. రాష్ర్ట ప్రయోజనాలే పరమావధిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి విజయం తమనే వరిస్తుందన్నారు. కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి మారీచుల కుట్రలు ఎదుర్కొవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

దార్శనికుడు పార్టీ వైసీపీ : ఎంపీ విజయసాయిరెడ్డి

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ వైసీపీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు అయ్యిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోందని కొనియాడారు. ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ. ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ అన్నారు. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నంది పలుకుతున్న దార్శనికుడి పార్టీ అని, మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించి 98.5 శాతం వాగ్దానాన్ని అమలు చేసిన నాయకుడి పార్టీ అని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

అంబేడ్కర్‌ సామాజిక న్యాయం అమలు చేసిన జగన్‌ : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

12 ఏళ్ల ప్రస్థానంలో వైసీపీ ప్రయాణం ఓ చరిత్ర అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో కృంగిపోయిన 570 కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తపన పడ్డారని గుర్తు చేశారు. నాడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం ఓదార్పుయాత్ర చేపట్టారని చెప్పారు. రెండేళ్లలో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలను గెలిపించుకున్న నాయకుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పడు మళ్లీ మెజార్టీతో వస్తానని చెప్పి గెలిచిన నాయకుడు సీఎం జగన్‌ అని, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్‌ సామాజిక న్యాయం ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేసిన చూపిస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

వెన్నుపోటు ధీరుడికి వణకు పుట్టించిన జగన్ : మంత్రి ఆర్‌కే రోజా

వెన్నుపోటు ధీరడైన చంద్రబాబు నాయుడుకి వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. కేంద్ర స్థాయిలో అధినేతలకి ఎదురెళ్లి స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వైఎస్ఆర్ జ్ఞాపకాలు, ఆశయాల తగ్గట్టుగా పరిపాలన అందించాలన్న దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు మంత్రి రోజా వెల్లడించారు. నగరి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు.


వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి కాకాణి

నెల్లూరులో వైసీపీ 13వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ఆర్ కలలు కన్న స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్నాడని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి సీఎం వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారని తెలిపారు



Next Story

Most Viewed