పొత్తు.. ఎవరు చిత్తు.. టీడీపీ, జనసేన పొత్తుతో అభ్యర్థుల్లో కొత్త టెన్షన్..!

by Disha Web Desk 19 |
TDP, Janasena
X

ఈ సారి ఎలాగైనా జగన్‌కు అధికారం రాకుండా చేస్తానని శపథం చేసిన జనసేనాని.. వైసీపీని మట్టి కరిపించేందుకు ఒక మెట్టు దిగి మరీ టీడీపీతో జత కట్టాడు. టీడీపీ, జనసేన పొత్తుతో ఇక జగన్ పని అయిపోయిందని ఇరు పార్టీల కార్యకర్తలు భావిస్తుండగా.. కొందరు నాయకుల్లో మాత్రం ఈ పొత్తుపై ఆందోళన రేకెత్తుతోంది.

ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులు పొత్తులో భాగంగా తమకు మొండి చేయి మిగులుతుందని కలవరపడుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఇరు పార్టీల నాయకులతోపాటు కార్యకర్తల్లో సందిగ్ధత నెలకొంది. మరి ఇరు పార్టీల నేతలు అధిష్టానం ఆదేశాలకు తలొంచుతారా ? తలపడతారా ? అనేది వేచి చూడాలి.

దిశ, ఏలూరు ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రోజుకో విధంగా రంగులు మారుతోంది. అధికార పక్షాన్ని కొల్లగొట్టేందుకు ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ పొత్తుల కుదుర్చుకున్నప్పటికీ ఆయా సెగ్మెంట్లలో అసంతృప్తి సెగలు రేకెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో నియోజకవర్గాల్లో ఉన్న ఇన్చార్జిల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఇటు జనసేన, అటు టీడీపీ ఇన్చార్జిలు చురుగ్గా ప్రజల్లో ఉంటున్నారు. పొత్తు కుదరక ముందు ఉన్న జోష్.. జత కట్టాక మాత్రం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన ఇన్చార్జిలు వ్యవహరిస్తున్న బొరగం శ్రీనివాస్, చిర్రి బాలరాజు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై పరాజయం పొందారు. వీరిద్దరూ రానున్న ఎన్నికల్లో గెలుపుపై గురి పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు.

సీటు మాదంటే మాదంటూ ప్రచారం

అధికార పార్టీని ఓడించేందుకు పార్టీల పెద్దలు తీసుకున్న పొత్తు నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల్లో నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ల సర్దుబాటులో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే పోలవరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం పార్టీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. మరో వైపు జనసేన ఇన్చార్జి చెర్రి బాలరాజు ఈసారి తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అటు జనసేన పార్టీ శ్రేణులు పోలవరం టికెట్ వదిలే ప్రసక్తి లేదని చెబుతుంటే, ఇటు టీడీపీ శ్రేణులు రాబోయే ఎన్నికల్లో పోలవరంలో తమ పార్టీ జెండా ఎగరేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.

హైకమాండ్ మాట వింటారా..?

2019 ఎన్నికల్లో పోలవరంలో త్రిముఖ పోటీ జరిగినప్పటికీ అధికార వైసీపీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆ సమయంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు బొరగం శ్రీనివాస్, చిర్రి బాలరాజు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఓటమి అనంతరం వారు కుంగిపోకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అధికారం లేకపోయినప్పటికీ ప్రజా సేవకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు వీరిని డైలమాలో పడేసింది. ఇప్పటి వరకు ప్రజల ఆదరాభిమానాలు పొందిన వీరు.. పొత్తులో భాగంగా తమ సీటును త్యాగం చేస్తారా..? లేక రెబల్‌గా అయినా ప్రజల్లో తమకున్న బలాన్ని పరీక్షించుంటారా..? అనేది వేచి చూడాలి.

Next Story

Most Viewed