YCP MP Adala Prabhakar Reddy : వైసీపీని వీడే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై నెల్లూరు ఎంపీ

by Dishafeatures2 |
YCP MP Adala Prabhakar Reddy : వైసీపీని వీడే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై నెల్లూరు ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారేది లేదని చెప్పుకొచ్చారు. ఎంపీ ఆదాలను పార్టీలోకి ఆహ్వానించామని చివరి నిమిషంలో చేరతారనే నమ్మకం ఉందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి పార్టీ మారుతున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిదేం లేకపోగా ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలియక టీడీపీ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టిందన్నారు. ఇటువంటి అభూత కల్పనలు, అవాస్తవాలను ప్రచారం చేయడం టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిపి గెలిచేలా చేశారని ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి‌గా కూడా తాను కీలక బాధ్యతులు నిర్వర్తిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా అందరికంటే ముందుగా తనను ప్రకటించడం తనపై ఉన్న నమ్మకాన్ని సీఎం జగన్ వెల్లడించారని తెలిపారు.

ఈ నమ్మకాన్ని తాను కాపాడుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీ అభ్యర్థిగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గం బరిలో ఉంటానని స్పష్టం చేశారు. తాను రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిసిన వెంటనే ఒక పథకం ప్రకారం టీడీపీ మోసపూరితమైన, తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందని విమర్శించారు. గత నాలుగు నెలలుగా ఈ విధమైన భోగస్ ప్రచారం మొదలైందని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురిచేసి తనకు, పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తన లబ్దికోసం ఒక మైండ్ గేమ్ ఆడుతోందని, దీనిని ఎవరు నమ్మబోరని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తధ్యమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుయుక్తులతో లబ్ధి పొందాలని భావించడం పగటి కల మాత్రమేనని, దానివల్ల వారికి లభించే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని, అందుకే ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా టీడీపీ ప్రచారాన్ని నమ్మరని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Read more : ఎంపీ ఆదాలను కూడా టీడీపీలోకి ఆహ్వానించాం.. మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed