ఆదివాసీల గుండెలపై 'హైడ్రో' కుంపటి

by Dishanational1 |
ఆదివాసీల గుండెలపై హైడ్రో కుంపటి
X

దిశ, అల్లూరి జిల్లా: ఉత్తరాంధ్రలోని గిరిజన జిల్లాల్లో కొండల నుంచి సహజ సిద్ధంగా ప్రవహిస్తున్న సెలయేర్ల నుంచి విద్యుత్ ను వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు హైడ్రో ప్రాజెక్టులు మంజూరు చేశాయి. వీటిలో పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మండలం, కురుకుట్టి, పాచిపెంట మండలం, కర్రివలస సమీపాల్లో 2,200 మెగావాట్స్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం, పెదకోట, చిట్టంపాడు, గుజ్జెలి ప్రాంతాల్లో 5,500 మెగావాట్స్ ఉత్పత్తి చేసే హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. వీటిని నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్ క్యాప్) నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకున్నాయి.

చట్టాల ఉల్లంఘన

వీటి మంజూరులో యథేచ్ఛగా గిరిజన చట్టాలను ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. గిరిజనులకు ప్రత్యేకంగా సంక్రమించిన పీసా, అటవీ హక్కుల చట్టాల కింద ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు అక్కడ గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్ 18న వేదాంత కేసులో వెల్లడించింది. ఒడిశాలోని కలాహండి, రాయగడ జిల్లాల్లో అక్కడి ప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా వేదాంత కంపెనీకి బాక్సైట్ మైనింగ్ అనుమతి ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమని తేల్చి రద్దు చేసింది. ఇదే కాకుండా 1997లో అప్పటి ఉమ్మడి విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో ఒక ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సమతా స్వచ్ఛంద సంస్థ వేసిన కేసులో సుప్రీంకోర్టు అనుమతులు రద్దు చేసింది. వీటి ఆధారంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజు తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే భూ బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హైడ్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకపోవడం, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడం జరిగిందని గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. దీంతోపాటు ప్రధానంగా రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ పారా 4 కింద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి ముందుగా ఇటువంటి ప్రాజెక్టుల మీద చర్చించాల్సి ఉంది. ఆ కౌన్సిల్‌ అభిప్రాయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ విధానం" ప్రకారం, పోటీ లేకుండా హైడ్రో ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే అధికారం లేదని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.

40 గ్రామాలకు తీవ్ర నష్టం

స్థానికుల ఆమోదం లేకుండా నిర్మాణం చేసే ప్రాజెక్టుల వల్ల రెండు జిల్లాల్లో 40 వరకు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. వేల ఎకరాల్లోని కాఫీ, జీడిమామిడి వంటి ఇతర పంటలతో కళకళలాడుతున్న సుమారుగా 15 వేల ఎకరాల గిరిజన భూములకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటి వల్ల సుమారుగా 10 వేల మంది జనాభా వేరే ప్రాంతానికి తరలిపోవాల్సిన అవసరం ఉంటుంది. పరోక్షంగా వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటితోపాటు ప్రధానంగా చింతపల్లి మండలం, ఎర్రవరం వద్ద ఏర్పాటు చేసే ప్రాజెక్టు వల్ల అనకాపల్లి జిల్లాలో మేజరు ప్రాజెక్టు తాండవకు వచ్చే ఇన్ ఫ్లోలు తగ్గనున్నాయి. దీని ప్రభావం 5 వేల ఎకరాల ఆయకట్టుపై పడనుంది. అనంతగిరి మండలంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న రైవాడ రిజర్వాయరుకు వెళ్లే నీటికి గండి పడి, దాని ప్రభావం విశాఖకు తరలించే తాగునీరుపై పడుతుంది. మన్యం జిల్లాలో సైతం ఇదే తరహాలో రెండు సాగు నీటి ప్రాజెక్టులపై వీటి ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమించేందుకు సిద్ధం

ఈ విధంగా గిరిజన చట్టాలను ఉల్లంఘించి, ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టుల వల్ల అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నా, అధికార పార్టీ సభ్యులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలైన పాడేరు, అరకు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గిరిజన ఎమ్మెల్యేలే ఉన్నా వీటిని పట్టించుకోకపోవడం విచాకరం. ఇదే కాకుండా రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న కొండల్లో నిత్యం జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టులు విజయవంతమైతే, మరిన్ని పదుల సంఖ్యలో వచ్చే ప్రమాదముందని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బాక్సైట్ తరహాలో మరోమారు గిరిజనులంతా సంఘటితపై ఉద్యమం చేయాలని ఒక నిర్ణయానికొచ్చాయి. దీనిపై గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స మాట్లాడుతూ గిరిజన చట్టాలకు విరుద్ధంగా హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు శోచనీయమని, దీనిపై గిరిజనులంతా ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed