- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గం : మాజీ మంత్రి
అనంతపురం జిల్లాలోని శింగనమల (Singanamala) నియోజకవర్గంలోని దుర్గాంజనేయస్వామి దేవాలయ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లాలోని శింగనమల (Singanamala) నియోజకవర్గంలోని దుర్గాంజనేయస్వామి దేవాలయ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇరు వర్గాల ఆరోపణలు ప్రత్యారోపణలతో దేవాలయ సంబంధిత వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ క్రమంలో దేవాలయ పూజారి రమణాచారి జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం నిరాహార దీక్షకు దిగారు. తనపై దాడి చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదనను వెల్లిబుచ్చారు. తమకు న్యాయం చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. తమ పెద్దల కాలం నుంచి దేవాలయాన్ని పరిరక్షిస్తున్నామని.. దేవతామూర్తులకు పూజాధికారులు నిర్వహిస్తున్నామని చెప్పారు. దైవ సేవలో ఉన్న తమపై దౌర్జన్యం జరగడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ (Sailajanath) కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారి రమణాచారిని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. రమణాచారి పోలీసులకు రాసిన ఫిర్యాదును పరిశీలించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ తాను చదివిన ఓ వార్తా కథనం ప్రకారం దేవాలయంలో ఆరు కోట్ల రూపాయల నిధులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆ నిధుల కోసమే ఆలయాన్ని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. అలా లేని పక్షంలో ఆలయ పూజారిని బయటకు పంపాల్సిన అవసరం ఏముందన్నారు. దేవాలయానికి తాళాలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసలు ఊరితో సంబంధం లేనివారు దాడికి పాల్పడడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. వేరే ఊరి నుంచి వచ్చి పూజారిపై ఆరోపణలు చేయడమే కాకుండా, దౌర్జన్యం చేయడం ఏమిటన్నారు. వారు గుడి కోసం చేసేందేమిటో తెలియజేయాలన్నారు. బయటివారు వచ్చి ఆలయ పూజారిపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు గుప్పించారు. కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాడి చేసేవారి పక్షాన పోలీసులు నిలుస్తున్నారా అని నిలదీశారు. ఇప్పటికైనా ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. బ్రాహ్మణుడు బలహీనుడని ఏం చేస్తాడులే అనుకోవద్దన్నారు. పూజారికి అండగా పార్టీలకతీతంగా తామంతా ఉంటామన్నారు. ఇదేమి చిన్న సమస్య కాదని.. పరిష్కరించకపోతే చినికి చినికి గాలివాన అవుతుందని స్పష్టం చేశారు. పరిస్థితులు అసలే సున్నితంగా ఉన్నాయని.. ఇప్పటికై ఆలయ పూజారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటానికి తమ మద్ధతు ఉంటుందని ప్రకటించారు.






