MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

by Disha Web Desk 22 |
Rajahmundry Court Extends Remands to MLC Anantha Babu
X

దిశ, ఏపీ బ్యూరో : Rajahmundry Court Extends Remands to MLC Anantha Babu| మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కోర్టులో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈనెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇకపోతే ఈ ఏడాది మే 20న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్య తానే చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 23 నుంచి అనంతబాబు రిమాండ్‌లోనే ఉన్నారు.

చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల అనుమానం

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన గతంలో కోర్టులను ఆశ్రయించారు. అయితే అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు విముఖత చూపాయి. పిటిషన్లు కొట్టివేశాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయలేదు. ఘటన జరిగిన 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో రాష్ట్ర పోలీసుల తీరుపై సుబ్రమణ్యం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను చంపిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మృతుడి తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని కోరారు.

రాజమహేంద్రవరంలో హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్‌ సీతారామమూర్తిని బాధిత కుటుంబ సభ్యులతోపాటు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడిని చంపిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీబీఐతో విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: టీడీపీలో ఆగస్టు సంక్షోభం.. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్

Next Story

Most Viewed