- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీలో ఆగస్టు సంక్షోభం.. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్
దిశ, ఏపీ బ్యూరో : ఆగస్టు నెల అంటేనే టీడీపీకి పెద్ద గ్రహపాటు నెలగా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశానికి ఇబ్బంది తెచ్చిపెట్టిన ఘటనలు అన్నీ ఆ నెలలోనే

దిశ, ఏపీ బ్యూరో : ఆగస్టు నెల అంటేనే టీడీపీకి పెద్ద గ్రహపాటు నెలగా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశానికి ఇబ్బంది తెచ్చిపెట్టిన ఘటనలు అన్నీ ఆ నెలలోనే జరుగుతూ ఉండడం వలన ఆగస్టుకు ఆ ముద్ర పడిపోయింది. తాజాగా పార్టీ మరోసారి ఈ నెలలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
మంగళగిరిలో హ్యాండ్ ఇచ్చిన కీలక నేత గంజి చిరంజీవి
ఏపీలో గత ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన నియోజకవర్గం మంగళగిరి. దీనికి ప్రధాన కారణం అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగడమే. అయితే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందే 2014లో ఆళ్ల చేతిలో ఓటమిపాలైన టీడీపీ నేత గంజి చిరంజీవి పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనికి కారణం 2014లో మొదలైన రాజకీయ చదరంగంలో తాను పావునయ్యానన్న అభిప్రాయమే. దీంతో ఈసారి మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న లోకేష్‌పై ఈ ప్రభావం పడబోతోంది. మంగళగిరిలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న చేనేత సామాజిక వర్గనేత గంజి చిరంజీవి పార్టీలో వెన్నుపోట్లు సహించలేక తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. 2014లో పార్టీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూనే వెన్నుపోట్లు సహించలేక పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీలో తనకు ఎదురైన పరిస్ధితులపై కన్నీళ్లు పెట్టుకున్నారు. దశాబ్దానికి పైగా మంగళగిరిలో టీడీపీకి కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవి ఇప్పుడు హఠాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పేయడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి తనపై మొదలైన వెన్నుపోట్లు, అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఎదురైన ఓటమి వెనుక వాటి ప్రభావం వంటి అంశాల్ని ఆయన కారణంగా చూపుతున్నా అంతకు మించికారణాలే దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. రేపో మాపో అధికార వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంతో పాటు మంగళగిరిలో సైతం టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీలోకే ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే స్థానిక ఎమ్మెల్యే ఆర్కేకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. మిగిలిన వాటి సంగతెలా ఉన్నా మంగళగిరి లో ఒక బలమైన సామాజిక వర్గం ప్రతినిధిగా ఉన్న చిరంజీవి పార్టీ నుంచి వైదొలగడం 2024 లో లోకేష్ గెలుపు పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.
పార్టీకి కొరుకుడు పడని ఎంపీ కేశినేని నాని వ్యవహారం
పార్టీ పరంగా ఏదైనా అసంతృప్తి ఎదురైతే బాహాటంగా దాన్ని వెల్లడించడానికి వెనుకాడని ఎంపీ కేశినేని నాని ఇటీవల చంద్రబాబు సమక్షంలో వ్యవహరించిన తీరు పార్టీ అధిష్ఠానాన్ని అవాక్కయ్యేలా చేసింది. తనకు బదులు తన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో అలకబూనిన నాని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు పూల బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాని చేతుల మీదుగా బొకే ఇప్పించడానికి టీడీపీ మరో ఎంపీ గల్లా జయదేవ్ ప్రయత్నించగా.. దాన్ని విసురుగా తోసెయ్యడం అదికూడా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరగడం తీవ్ర దుమారాన్ని రేపింది. దాంతో రానున్న ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో అన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విజయవాడలో గెలిచిన కేశినేని నాని ఒకవేళ పార్టీకి దూరం అయితే దాని ప్రభావం గట్టిగానే టీడీపీపై పడుతుంది అంటున్నారు పరిణామాలు గమనిస్తున్నవారు.
ఎన్నికలకు దూరం అంటున్న గల్లా అరుణ కుమారి
2024 ఎన్నికలకు తాను దూరం అంటూ సీనియర్ టీడీపీ నేత గల్లా అరుణకుమారి ఇప్పటికే ప్రకటించారు. గల్లా కుటుంబం నెమ్మదిగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో గల్లా నిర్ణయం కోసం పార్టీ ఎదురుచూస్తుంది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఈసారి మాత్రం ఎమ్మెల్యే గా పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే దీనిలో ఒక చిక్కు ఉంది. సాధారణంగా ఎంపీ సీటుకు ఎవరు పోటీచేస్తారో ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన ఖర్చులో కొంతవరకూ వారు భరిస్తారు. మరి అర్ధబలం దండిగా ఉన్న గల్లా ఫ్యామిలీ అసెంబ్లీకి పోటీ చేస్తే ఆ ఖర్చును తమపై వేసుకుంటారా అనేది అనుమానమే. ఈ పరిణామాలు కూడా ఈ ఆగస్టులోనే తెరమీదకు రావడం యాధృచ్చికమే అయినా పార్టీలో చర్చను రేపేవే.
శ్రీకాకుళంలోనూ పార్టీకి తప్పని వర్గపోరు
శ్రీకాకుళం టీడీపీలో రెండు వర్గాలు ప్రధానం. ఒకటి పార్టీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుల కింజరాపు కుటుంబం అయితే మరొకటి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబం. ఆమె గతంలో 20 వేల ఓట్లతో ధర్మాన ప్రసాదరావును ఓడించి చరిత్ర సృష్టించారు. 2019లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు . అప్పటినుండి పార్టీ లో రెండు వర్గాల మధ్య ఆధిపపత్య పోరు నడుస్తుంది. ఇటీవలి మినీ మహానాడు సందర్భంగా ఆ విభేదాలు రచ్చకెక్కాయి కూడా. దీంతో అలెర్ట్ అయిన లక్ష్మీదేవి లోకేష్‌ను కలిసి చర్చలు జరిపారు కూడా. ప్రస్తుతానికి చల్లారినట్లే కనిపిస్తున్నా ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు మళ్లీ బాహాటంగా బయటకొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీ పెద్దలు కూడా ఈ రెండు వర్గాల వ్యవహారంపై ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్స్ వర్సెస్ జూనియర్స్
టీడీపీలో అసలైన సమస్య సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటున్నారు ఎనలిస్టులు. పాత వాళ్ళలో కొందరికే టికెట్స్ అంటూ పార్టీలోని ఒకవర్గం ప్రచారం చేస్తుంది. దాంతో పార్టీ సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. నిజానికి పార్టీ ప్రస్తుత రాజకీయాలు అన్నీ చినబాబు కేంద్రంగానే నడుస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఆయన దృష్టిలో పడాలని కొందరు ప్రయత్నిస్తుంటే .. గతంలో తాము పార్టీకి చేసిన సేవలు గుర్తించాలంటూ చంద్రబాబు వద్దకు వెళుతున్నట్టు సమాచారం. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువతకు పెద్దపీట వేసి .. సీనియర్ల అనుభవాన్ని పార్టీ సేవలకు వాడుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై పార్టీలో అంతర్గంతంగా పెద్ద చర్చనే నడుస్తుంది అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా ముదిరే అవకాశమూ లేకపోలేదన్నది ఎనలిస్టుల మాట.
ఆగస్టు అంటేనే టీడీపీకి తలనొప్పి
అదేంటో గానీ టీడీపీకి ఆగస్టు నెల అంటేనే సమస్యల సుడిగుండం అనే పేరు పడిపోయింది. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ మొదలు పార్టీ ఆగస్టునెలలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది. తాజాగా కూడా అలాంటి చిక్కుముళ్ళే పార్టీకి మళ్ళీ ఎదురవుతున్నాయి. మరి గతంలో అలాంటి వాటి నుంచి చాకచక్యంగా పార్టీన నుంచి బయటపడిన చంద్రబాబు చాణక్యం మరోసారి ఫలిస్తుందా..? లేదా? అనేది వేచి చూడాల్సిందే.






