బీజేపీతో లాభమా.. నష్టమా ! టీడీపీ, జనసేనలో జోరుగా చర్చలు

by Disha Web Desk 6 |
బీజేపీతో లాభమా.. నష్టమా ! టీడీపీ, జనసేనలో జోరుగా చర్చలు
X

టీడీపీతో పొత్తు ఖాయమని పవన్​ తేల్చిచెప్పారు. ఇతర పార్టీలతో పొత్తు లేకుండా ముందుకెళ్తే నష్టపోతామని పార్టీ మండల, డివిజన్​ అధ్యక్షుల సమావేశంలో జనసేనాని కుండబద్దలు కొట్టేశారు. బీజేపీని కూడా ఒప్పిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీ సర్కారుకు తెర వెనుక నుంచి మద్దతునిస్తున్న కాషాయ పెద్దలను తమ వైపు తిప్పుకోగలమని భావిస్తున్నారు. కర్నాటకలో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఈ పని తేలికవుతుందని పవన్​ ఆలోచన కావొచ్చు. బీజేపీతో కలిస్తే ప్రజల నుంచి ఏమేరకు మద్దతు లభిస్తుంది.. ఆ పార్టీకి జనంలో ఉన్న వ్యతిరేకత ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. వైసీపీ, బీజేపీ ఒకటేనని టార్గెట్​ చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారనే అంశాలపై టీడీపీ, జనసేన పార్టీల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పటిదాకా కమలనాథులు టీడీపీ అంటేనే అంత ఎత్తున ఎగిరిపడుతున్నారు. వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీని దెబ్బతీయకుండా బలపడలేమన్న ఆలోచనకు కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో రెండు పార్టీల నేతలతోనూ టచ్​లో ఉంటున్నారు. ఎన్నికల నాటికి అప్పటి అంచనాను బట్టి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. అందుకే జనసేనను జారిపోకుండా పట్టుకొస్తున్నారు. ఇక్కడ జనసేన పరిస్థితి వేరు. రానున్న ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లయినా తెచ్చుకొని ప్రభుత్వంలో భాగం పంచుకోకుంటే పార్టీ ఉనికి కష్టమని పవన్​ ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన పొత్తు మీద క్లారిటీ ఇచ్చేశారు. కర్నాటకలో బీజేపీ ఓడినా టీడీపీ, జనసేనతో కలిసేదీ లేనిదీ ఎన్నికల దాకా తేల్చకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వైసీపీని ఒంటరి చేసే వ్యూహం..

బీజేపీ అగ్రనేతలను ఒప్పించాలనే పట్టుదలతో పవన్​ ఉండగా కాషాయ పార్టీతో కలిసి ముందుకు సాగడంపై టీడీపీ, జనసేనల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి తెర వెనుక కమలనాథులు సహకరించకుంటే విజయం సాధిస్తామని కొందరు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను పర్యవేక్షించేది కేంద్ర బలగాలు కాబట్టి ఇక్కడ పోలీసులతో వైసీపీ ఏం చేయలేదని భావిస్తున్నారు. బీజేపీ పొత్తుకు అంగీకరిస్తే వైసీపీ నేతలపై ఉన్న ఈడీ, సీబీఐ కేసులు వేగవంతమవుతాయని అనుకుంటున్నారు. వైసీపీని ఒంటరి చేయడం ద్వారా ఓడించడం తేలికవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణాలరీత్యా బీజేపీతో పొత్తుకు చంద్రబాబు, పవన్​ ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

బీజేపీపై రగులుతున్న ప్రజానీకం..

మరోవైపు బీజేపీ మీద రాష్ట్ర ప్రజలు పీకల్దాకా ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చలేదన్న ఆక్రోశం నెలకొంది. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా తెగనమ్ముతామని కేంద్రం తెగేసి చెబుతోంది. వెనుకబడిన జిల్లాలకు బుందేల్​ఖండ్​ తరహా ప్యాకేజీ ఇవ్వాలని అడిగితే ఆపాటికే ఇస్తున్న అరొకర నిధులనూ నిలిపేసింది. విశాఖ రైల్వే జోన్​ గురించి అతీగతీ లేదు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయలేమని చేతులెత్తేసింది. విభజన చట్టంలో పొందుపరిచిన పోర్టు, కడప ఉక్కును గాలికొదిలేసింది.

వైసీపీతో పాటు బీజేపీని టార్గెట్ చేస్తేనే..

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్​ ధరలను 50 శాతం పెంచడంతో ప్రజలు అగ్గిలంమీద గుగ్గిలమవుతున్నారు. చివరకు నిత్యావసరాలపై కూడా జీఎస్టీ పన్నులు బాదేయడంతో జనం మండిపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రజల్లో చీలిక తెచ్చే విధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదనే ఆందోళన నెలకొంది. ప్రధానంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర అభద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంకా విద్యుత్​, అర్బన్​ సంస్కరణలతో ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపడాన్ని సహించలేకపోతున్నారు. బీజేపీతో ఎవరు కలిస్తే వాళ్లకు ఆ పార్టీపై వ్యతిరేకత విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇక్కడ బీజేపీని టార్గెట్ చేయకుండా కేవలం వైసీపీ మీద విమర్శలు ఎక్కుపెడితే ప్రయోజనం లేదు. ఈ రెండు పార్టీలను ఒకే గాటన కడితేనే ప్రజల నుంచి సానుకూలత ఉంటుందనే అభిప్రాయం రెండు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Also Read...

Nara lokesh: దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట




Next Story

Most Viewed