మా అన్నయ్యకు అందుకే MP టికెట్ ఇవ్వలే.. అసలు విషయం బయటపెట్టిన Pawan Kalyan

by Disha Web Desk 19 |
మా అన్నయ్యకు అందుకే MP టికెట్ ఇవ్వలే.. అసలు విషయం బయటపెట్టిన Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా నాగబాబు ఎన్నికల బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. అయితే, అనూహ్యంగా నాగబాబుకు ఎంపీ టికెట్ దక్కలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి దక్కింది. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం రెండు పార్లమెంట్ స్థానాలు దక్కగా.. కాకినాడ నుండి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుండి సిట్టింగ్ ఎంపీ బాలశౌరిలకు పవన్ కల్యాణ్ టికెట్ ఇచ్చారు. దీంతో నాగబాబు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టమైంది.

ఈ క్రమంలో తన సోదరుడు నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయటపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పవన్ కల్యాణ్ తణుకులో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుండి జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాలి.. కానీ పొత్తులో భాగంగా బీజేపీ అడగటంతో ఆ సీటును వారికి ఇచ్చేశామని తెలిపారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో తన సోదరుడు నాగబాబు సారీ చెప్పానని పవన్ పేర్కొన్నారు. అధికార వైసీపీని గద్దె దించడంలో భాగంగానే టికెట్లు కేటాయింపు విషయంలో గానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే వెనక్కి తగ్గామని స్పష్టం చేశారు. జగన్ సర్కార్‌ను అధికార పీఠం నుండి దింపి.. ఏపీకి విముక్తి కల్పించడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు.

Next Story

Most Viewed