మత్స్యకారులకు పవన్ కల్యాణ్ కీలక హామీ

by Disha Web Desk 16 |
Pawan Kalyan
X

దిశ, వెబ్ డెస్క్: మత్స్యకారులకు పవన్ కల్యాణ్ కీలక హామీ ఇచ్చారు. మత్య్స సంపద పెంచేందుకు కేంద్రం త్వరలో చర్యలు చేపట్టబోతోందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా పెడనలో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్య్సకారులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం.217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మత్య్సకారులకు ఉపాధి కల్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పెడనలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకు లంచం ఇవ్వాల్సిందేనని మండిపడ్డారు. పెడనలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని.. ప్రశ్నించిన వ్యక్తులను చెట్టుకు కట్టి మరీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కళంకారీ, చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న తనపై తమ కులానికి చెందిన నేతలతోనే తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తమలో తాము కొట్టుకోవాలని జగన్ చూస్తున్నారని.. అలాంటివేవీ జరగవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కళంకారీ కార్మికులకు 5 ఎకరాల్లో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Read More..

జనసేన అభ్యర్థులతో ప్రమాణం చేయించిన పవన్ కల్యాణ్

Next Story