చిన్నపాటి లోపాలు చూపి పథకాలు ఆపొద్దు.. మంత్రి అమర్నాథ్

by Dishafeatures2 |
చిన్నపాటి లోపాలు చూపి పథకాలు ఆపొద్దు.. మంత్రి అమర్నాథ్
X

అనకాపల్లి, మే 27: చిన్నపాటి లోపాలు చూపి ప్రభుత్వ పథకాలు నిలిపివేయొద్దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 82 వార్డుల్లో నగర పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, కార్పొరేటర్లు మందపాటి సునీత నేతృత్వంలో శనివారం అనకాపల్లి పట్టణంలోని రామచంద్ర థియేటర్ వెనక వీధి, పాత కరెంట్ ఆఫీస్ వీధి, దుర్గా లాడ్జి వీధి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ వీధి, చాకలిపేట తదితర ప్రాంతాలలోని గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి వద్దకు వచ్చి సమస్యలు తెలియజేసుకున్నారు. సాంకేతిక కారణాలు చూపి వస్తున్న పథకాలు మధ్యలోనే నిలిపి వేస్తున్నారని వాపోయారు. నజీమా అనే ఒక మహిళ మంత్రి అమర్నాథ్ వద్దకు వచ్చి, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను నాలుగు నెలలపాటు పింఛను అందుకున్నానని, ఆదాయ పన్ను ఎక్కువగా ఉందని చూపి తన పించను, రేషన్ కార్డు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతకాలం కిందట తమ కుటుంబం వ్యాపారం చేసుకుని జీవించేదని, వివిధ కారణాలవల్ల చాలా కాలంగా వ్యాపారం చేయడం లేదని, కానీ పాత ఆదాయపన్ను చూపి పథకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరొక మహిళ తమ ఇంటి వైశాల్యం కొద్దిపాటిగా పెరిగిందని, దీన్ని సాకుగా చూపి పథకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ చిన్నపాటి లోపాలు చూపి వస్తున్న పథకాలు నిలిపివేయొద్దని, దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. సచివాలయ సిబ్బంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ మాత్రం అర్హత ఉన్నా పథకాలు తప్పక వర్తింప చేయాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఫిర్యాదులు అందకూడదని సూచించారు.


Next Story

Most Viewed