AP News: కార్మిక సంఘాల మహాపాదయాత్ర..ఏపీ రాజకీయ పార్టీలకు నిరసన సెగ..

by Disha Web Desk 3 |
AP News: కార్మిక సంఘాల మహాపాదయాత్ర..ఏపీ రాజకీయ పార్టీలకు నిరసన సెగ..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలకు కార్మిక సంఘాలు షాక్ ఇచ్చాయి. ఈ రోజు ఉదయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కార్మిక సంఘాల సభ్యులు మహా పాదయాత్ర చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కూర్మన్నపాలెం ఆర్చి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ మహాపాదయాత్రను కొనసాగించారు.

కాగా ఈ పాదయాత్రలో కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. పాదయాత్ర చేస్తున్న సభ్యులు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి.

వెంటనే ప్రభుత్వం స్పందించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. ఇక మహా పాదయాత్ర చేస్తున్న కార్మికులకు మహిళలు, యువకులు పువ్వులు వేసి స్వాగతం పలికారు. ఇక కార్మికులు చేస్తున్న ఈ పాదయాత్రకు మద్దతుగా వివిధ పార్టీ ప్రముఖులుతో పాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారి,గాజువాక వైసీపీ ఇంచార్జి ఉరకూటి చందు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అయోధ్య రామ్, ఆదినారాయణ, సీహెచ్ నరసింగరావు, రామచంద్ర, మస్తానప్పలు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేసాయి. విశాఖ ఉక్కుప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని 1116 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేలుకోవడం లేదని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 75వేల మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.

అలాంటి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కో అడుగూ ముందుకెళ్తుంటే.. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఎక్కడ కేంద్రానికి తనపై కోపమొస్తుందో అనే భయంతోనే జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేంద్రానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు స్టీల్​ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story