వివేకా హత్య గురించి అతడికి ముందే తెలుసు: YS సునీత ఇంప్లీడ్ పిటిషన్‌లో కీలక అంశాలు

by Satheesh |
వివేకా హత్య గురించి అతడికి ముందే తెలుసు: YS సునీత ఇంప్లీడ్ పిటిషన్‌లో కీలక అంశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. వైఎస్ హత్య కేసు నిందితులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారానే డబ్బులు చేరాయని పేర్కొన్నారు. గూగుల్ టేకౌట్ లొకేషన్ ఆధారంగా వివేకా హత్యకు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడు సునీల్ యాదవ్ ఇంట్లో ఉన్నారన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ ఇంటికి అవినాష్ రెడ్డి పలుమార్లు వెళ్లాడని తెలిపారు. అంతేకాకుండా 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని కావాలనే ఓడించారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వివేకాకు టికెట్ ఇస్తున్నారని హత్యే చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంపీ టికెట్ కోసమే హత్య చేసినట్లు భావిస్తున్నామన్నారు.

వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే కంటే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసన్నారు. హత్య చేశాక అందరిని అవినాష్ కాపాడుకుంటాడని ఎర్రగంగిరెడ్డి వివేకా హత్య కేసులోని మిగిలిన నిందితులకు చెప్పాడని.. వివేకా మరణవార్తను మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచిచూశారని పేర్కొన్నారు. వివేకా మరణంపై శివప్రకాశ్ రెడ్డి సమాచారం ఇచ్చాడని.. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడన్నారు.

పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయారని అబద్ధం చెప్పి.. వివేకాది హత్య కాదు సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని సునీత ఇంప్లిడ్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సరిగా జరగడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లో వివేకా హత్య వెనుక ఆయన కూతురు సునీత ఉండొచ్చని అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కోర్టు అనుమతితో సునీత రెడ్డి ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story