Congress: అత్యంత దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్.. గెలుపు ఊసే లేదుగా..!

by Disha Web Desk 16 |
Congress: అత్యంత దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్..  గెలుపు ఊసే లేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి అధికారం చేపట్టనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. దీంతో కర్ణాటకతో పాటు తెలంగాణలో సంబురాలు అంబరాన్ని అంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెట్టింపు ఉత్సాహంతో పని చేశారు. విజయం కోసం కృషి చేశారు. తాజాగా విడుదల ఫలితాలతో టీ కాంగ్రెస్ నేతలు ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. దక్షిణాదిలో ఇంత పెద్ద విక్టరీ కొట్టడంతో సంబురాలు చేసుకుంటున్నారు. మీడియా ముఖంగా రీ సౌండ్ వచ్చేలా గెలుపు ఆనందాన్ని వినిపిస్తున్నారు. తమ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనేనని చెబుతున్నారు.

ఏపీలో రివర్స్

కానీ కర్ణాటకకు ఆనుకుని ఉన్న ఏపీలో మాత్రం రివర్స్‌లో ఉంది. ఎలాంటి చప్పుడు లేదు. బాణాసంచా లేదు. స్వీట్స్ లేవు. కనీసం కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు కూడా రావడంలేదు. ఒకరిద్దరూ హర్షం వ్యక్తం చేసినా తెలంగాణ నేతల్లో కనిపించిన ఉత్సాహం లేదు. ఇటీవల కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు తెగ హడావుడి చేశారు. ఆ తర్వాత అలాంటి హడావుడి కనిపించలేదు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు కంటికి కరవయ్యారు. ఒకప్పుడు ఎన్నికలంటే ఏపీలో కాంగ్రెస్ గెలిచిందా..?. టీడీపీ గెలిచిందా అనే మాటలు వినిపించాయి.

విభజన తర్వాత తిరోగమనంలో కాంగ్రెస్

ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తిరోగమనంలో పడింది. కాంగ్రెస్ నాయకులతో పాటు కేడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోవడంతో కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి లేరు. పరువు కోసం కొన్ని చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. ఇక రాష్ట్రంలోని సమస్యలపై అడపాదడపా కార్యక్రమాలు చేపట్టినా వాటికి అంతగా ప్రజా స్పందనలేదు. కేంద్రమంత్రులుగా పని చేసిన కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జితో పాటు టీపీసీసీ చీఫ్‌ను కూడా ప్రకటించారు. అయినా కూడా అంతగా కార్యక్రమాలు లేవు. కార్ణాటక ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు మాత్రం తామే గెలుస్తామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్పారు. మిగిలిన నేతలెవరూ స్పందించలేదు. నేతలు, పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మరి ఎప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడేదని, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేదని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌కు సైతం స్పందన

అటు బీజేపీ మాత్రం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ తాము ఉన్నామని చెప్పుకుంటోంది. మీడియాతో పాటు పత్రికల్లో ఆ పార్టీ నేతలు కనపడుతూ ఏపీలో బీజేపీ ఉందనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కంటే రాష్ట్రంలో తమకే బలముందని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలోనే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్‌కు సైతం కొంత స్పందన వస్తోంది. ఆ పార్టీలో చేరేందుకు కొందరు ఉత్సాహం చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పుకుంటున్నారు.

సంబురాలు చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్

కానీ ఉమ్మడి ఏపీని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విభిన్నంగా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఏం చేయలేదని పరిస్థితి ఉంది. ఏదైనా కార్యక్రమాలు చేపడితే అందుకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. ఇంచార్జులను మార్చినా కూడా పార్టీలో మెరుగైన పరిస్థితులు కనిపించడంలేదని కొందరు నేతలు అంటున్నారు. మరి వచ్చే ఎన్నికలకైనా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Karnataka Election Results: కర్ణాటక కోసం పార్థించాం... బీజేపీని ఓడించాం: కేఏపాల్

Next Story