టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

by Seetharam |
టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం బ్యారెక్‌లో ఏసీ మాత్రం పెడితే సరిపోదని బాడీ చెకప్ చేయాలి అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జైళ్ల డీజీఐ రవికిరణ్ పెట్టిన ప్రెస్మీట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జైళ్ల డీఐజీ ఒక డాక్టర్‌లా వ్యవహరించారని.... పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా మాట్లాడారని అన్నారు. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు నాయుడు ఒక్కరినే ప్రత్యేకంగా చూడలేమంటూ జైలు అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు.‘ 140 కోట్ల మంది భారతీయుల్లో జగన్ ఒక్కడే. అలాంటి వ్యక్తికి హెలీక్యాప్టర్, బుల్లేట్ ప్రూఫ్ వెహికల్, సెక్యూరిటీ ఇవన్ని ఎందుకు? ఆయన సీఎం అనే కదా! అలాగే చంద్రబాబు కూడా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. జగన్ చెంచల్ గూడ జైల్లో ఎంజాయ్ చేసినట్లు చంద్రబాబు ఎంజాయ్ చేయటంలేదు’ అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 74ఏళ్ల చంద్రబాబు డీహైడ్రేషన్, ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదు..బాడీ చెకప్ చేయాలి అని కోరారు. జైళ్ల అధికారులు డాక్టర్లు చెప్పింది యధాతథంగా చెప్పటంలేదని వివరాలు దాస్తున్నారని అన్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదు...చంద్రబాబు వెయిట్ నెల క్రితం ఎంత ఉంది.. ఇప్పుడు ఎంత ఉందనేది వైద్యులు చెప్పాలని చెప్పుకొచ్చారు.

జైలును అత్తారిల్లులా మార్చింది జగనే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలందించారని అలాంటి వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. జైలును అత్తగారి ఇల్లులా మార్చిన చరిత్ర జగన్ రెడ్డిది అనే విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. చెంచల్ గూడ జైలును వైసీపీ కార్యాలయంగా మార్చి, అక్కడే పార్టీలో చేరికలు, పార్టీ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. షెటిల్ ఆడుతూ చెంచల్ గూడ జైలులో జగన్ కాలక్షేపం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయినా...ప్రజలు మరచిపోలేదన్నారు. జైల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటిని సప్లై చేయడం వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చింది అని అన్నారు. చంద్రబాబు హెల్త్ విషయంలో డాక్టర్స్ రిపోర్టుని యధావిధిగా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఒకలాగ, జైళ్ల డీఐజీ ఒకలాగ, ప్రిజన్స్ డీజీ ఒకలాగ, మినిష్టర్లు ఒకలాగ మాట్లాడడం సబబుకాదు అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు.

ప్రభుత్వానిదే బాధ్యత

టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు అని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. టీడీపీ అధికారం వచ్చి చట్టాల్ని ఇదేలాగ అమలు చేస్తే వైసీపీవాళ్ల గతేంటి? అని నిలదీశారు. వైసీపీ వారు అన్నం తినే పరిస్థితులు కూడా ఉండవు అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయకులు బతికున్నంత కాలం చిప్ప కూడు తినాల్సిందే అని హెచ్చరించారు. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి నాయకుల వరకు దాడులు, అరాచకాలు మితిమీరాయి అని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నిజాలు దాచొద్దు...వాస్తవాలు చెప్పాలి....అవసరమైతే ఆయన ప్రైవేటు వైద్యుల్ని అనుమతించాలి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఒక్క ఏసీ పెడితే సరిపోదు. డీ హైడ్రేషన్ తో చంద్రబాబు అస్వస్థతకు గురికావడంతో కోట్లాదిమంది తెలుగు ప్రజలు తల్లడిల్లుతుంటే వైసీపీ నాయకులకు నవ్వులాటగా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవాలి...వారిని సంప్రదించాలన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి అని సూచించారు. హెల్త్ విషయంలో నివేదికలు, రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.

Next Story