Pattabhi: జగన్ శాశ్వత కాపురం చంచల్‌గూడ జైల్లోనే!

by Disha Web Desk 16 |
Pattabhi: జగన్ శాశ్వత కాపురం చంచల్‌గూడ జైల్లోనే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ముఖ్యమంత్రి దంపతుల్ని విచారిస్తేనే హూ కిల్డ్ బాబాయ్ కథకు ముగింపు లభిస్తుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రజల మెదళ్లను తొలుస్తున్న పలు ప్రశ్నలకు సీబీఐకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి దంపతులదేనన్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని జగన్ తన అనుకూల మీడియా ఎలా చెప్పిందో దాని నిర్వాహకురాలైన భారతిరెడ్డే సీబీఐకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘హత్య జరిగిన నాటి అర్థరాత్రి అవినాశ్ రెడ్డి, భారతిరెడ్డి పీఏకి ఫోన్ చేసి ఆమెతో ఏంమాట్లాడారు?.. హత్య జరిగిన వెంటనే భారతిరెడ్డి మేనమామలే ఎవరో చెప్పినట్టు ఘటనా స్థలానికి ఎందుకెళ్లారు. వివేకానందరెడ్డి పార్థివదేహానికి కుట్లువేసిన ప్రకాశ్ రెడ్డి, భారతిరెడ్డి తండ్రి గంగిరెడ్డి ఆసుపత్రి కాంపౌండర్ కాదా?. భారతిరెడ్డి పెదనాన్న కొడుకైన ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి ఎందుకెళ్లారు. వెళ్లి ఏంచేశాడు?. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే హత్యకేసు విచారణకు చంద్రబాబు నియమించిన సిట్‌ను నీరుగారుస్తూ అడిషనల్ డీఐజీ నేత్రత్వాన్నికాదని ఎస్పీస్థాయి నేత్రత్వానికి ఎందుకు పరిమితం చేశారు?’ అని ప్రశ్నించారు.

ఆ పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారు?

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. వివేకాకుమార్తె తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే జగన్ తాను అంతకుముందు వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారనేదానిపై సమాధానం చెప్పాలన్నారు. ‘గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిట్ అధిపతి అభిషేక్ మహంతి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటే...నిందితుడిని వదిలేయాలని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎందుకు చెప్పారు?. హత్య జరిగిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన శంకరయ్య మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి ఎందుకు నిరాకరించేలా చేశారు?. సస్పెన్షన్లో ఉన్న అతనికి జగన్ ప్రభుత్వం ఆఘమేఘాలపై తిరిగి పోస్టింగ్ ఎందుకిచ్చింది?. కడప ఎంపీ టిక్కెట్ వివాదమే వివేకాను బలితీసుకున్నది నిజంకాదా?. వివేకా చనిపోయిన మరుసటిరోజునే అవినాశ్ రెడ్డిని జగన్ ఎందుకు కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు?.’ అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పట్టాభి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసలు సూత్రధారులను విచారించాలి

‘వివేకాహత్యకేసులో సీబీఐ ఇప్పటివరకు విచారించింది కేవలం పాత్రధారుల్నే. అసలు సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డిని విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చినట్టు.’ అని పట్టాభి పేర్కొన్నారు. ‘వై.ఎస్.భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి లాంటివాళ్లంతా కేవలం పాత్రధారులే. వెనకున్న సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నారు.’ అని పట్టాభి ఆరోపించారు. ‘భాస్కర్ రెడ్డిని, అవినాశ్ రెడ్డిని, ఇతరుల్ని అరెస్ట్ చేసి విచారించినంతమాత్రాన వివేకాహత్యకేసు మిస్టరీ వీడినట్టుకాదు. అసలు సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య శ్రీమతి భారతిరెడ్డిలకు కూడా సీబీఐ నోటీసులిచ్చి విచారించాలి. వివేకా హత్య కేసులో ప్రజల మెదళ్లలో తొలిచేస్తున్న అనేక భేతాళప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సీబీఐ విభాగం ఖచ్చితంగా ముఖ్యమంత్రి దంపతుల్ని విచారించాల్సిందే. జగన్ పులివెందుల పిల్లి కాబట్టే పిల్లిలాగా కాపురాలు మారుస్తున్నారు. ఇడుపులపాయ, లోటస్ పాండ్ , తాడేపల్లి ప్యాలెస్‌లో కాపురాలు అయిపోయాయి. ఇప్పుడు వైజాగ్ ప్యాలెస్‌కు మకాం మార్చాలని చూస్తున్నారు. కానీ ఇక ఆయన శాశ్వత కాపురం చంచల్ గూడ జైలే. వైజాగ్ల్‌లో కాపురం పెట్టకముందే, జగన్ కాపురం చంచల్ గూడ జైల్లో ప్రారంభం అవుతుంది.’ అని పట్టాభిరామ్ హెచ్చరించారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story