- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా సముద్రాన్ని కాపాడండి.. రామాపురం తీరంలో మత్స్యకారులు, స్థానికుల నిరసన
రామాపురం సముద్ర తీరంలో పర్యాటక ముసుగులో ఆక్రమణలు! మత్స్యకారుల ఆందోళనతో ఉద్రిక్తత. CRZ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దిబ్బల తొలగింపు.

దిశ ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పర్యాటక రంగం ముసుగులో మత్సకారులను ఖాళీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, మా సముద్రాన్ని అధికారుల నుంచి రిసార్ట్స్ యజమానుల నుంచి కాపాడండి అంటూ రామాపురం మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం మండలం రామాపురం పరిధిలోని సముద్రతీరంలో పర్యాటకులకు వినోదం పేరుతో బోటింగ్ ఏర్పాట్లకు గత నాలుగు రోజులుగా రంగం సిద్ధం చేస్తున్న సమయంలో శుక్రవారం స్థానిక మత్స్యకారుల ఆందోళన వివాదాస్పదంగా మారింది.
ఈ ఆందోళనకు మత్స్యకార సంఘాల నాయకులు మద్దతు తెలుపడంతో సముద్రతీరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒంగోలుకు చెందిన దేవనూరి రాజ్ కుమార్ దివే చీరాల ఎల్ ఎల్ పి పేరుతో బొట్ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొంది, స్థానిక ప్రజా ప్రతినిధి, ఆర్.డి.ఓ సహకారంతో సముద్ర తీరంలో నో డెవలప్ మెంట్ జోన్ పరిధిలో సముద్ర అలల రేఖ (హై టైడ్ లైన్) నుండి 200 మీటర్ల పరిధిలోని ఇసుక దిబ్బలను చదును చేయడం ప్రారంభించారు.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్న ఈ వ్యవహారాన్ని స్థానిక మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సముద్ర తీరంలో భారీ యంత్రాలతో ఇప్పటికే ఇసుక దిబ్బలను పూర్తిగా తొలగించారు. ఈ విషయంపై స్థానిక మత్స్యకారులు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ వాస్తవాలను మరుగున పెట్టిన ప్రభుత్వ అధికారులు పర్యాటక రంగం పేరుతో జిల్లా కలెక్టర్ అనుమతి ఉందంటూ ఇసుక దిబ్బలను చదును చేశారు. ఈ నెల 19న బోటింగ్ ప్రారంభించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై సోషల్ మీడియాలో పలు కదనాలు వైరల్ కావడంతో శుక్రవారం ఫారెస్ట్ అధికారులు రావడంతో భారీ యంత్రాలతో సహా నిర్వాహకులు పారిపోయారనీ మత్స్యకారులు చెబుతున్నారు. చట్ట విరుద్దంగా పర్యావరణ అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తే రామాపురం మరో జువ్వలదిన్నె అవుతుందనడంలో సందేహం లేదు.






