మొదటి నుంచీ అసమ్మతి .. అధిష్టానం ఎవరి వైపు..!

by Disha Web Desk 16 |
మొదటి నుంచీ అసమ్మతి .. అధిష్టానం ఎవరి వైపు..!
X

దిశ ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి కుంపటి సెగకు అధికారపార్టీలోని ఓ వర్గం సలసలకాగిపోతోంది. అధిష్టానం అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ అసమ్మతి నేతలు తమ పంతం నెగ్గించుకునేందుకు సంఘటితంగా కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ గజ్జెల బ్రహ్మా రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గోపిరెడ్డి నియోజకవర్గంలోని కొందరికి ప్రాధాన్యత కల్పించడంతోపాటు గజ్జెల వర్గాన్ని చిన్నచూపు చూడటమేనన్నది అసమ్మతి నేతల వాదన. ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతు తెలిపిన గజ్జెల బ్రహ్మారెడ్డికి 2014లో ఎమ్మెల్యే టికెట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా గోపిరెడ్డి తెరమీదకు వచ్చారు. అప్పట్లో ఇద్దరు నాయకులు తమకు తగ్గ రీతిలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పవచ్చు.

మొదటి నుంచీ వివాదమే..

కాగా 2014లో ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. గజ్జెల బ్రహ్మారెడ్డి ఆ సమయంలో ఎమ్మెల్సీ, ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయంగా ఇస్తామని చెప్పి బుజ్జగించడంతో నియోజకవర్గంలో మంచి పట్టున్నప్పటికీ అధిష్టానం సూచనలకు తలొగ్గి టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు కృషి చేశారు. దీంతో గోపిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనేది నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న మాట. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రహ్మా రెడ్డి వర్గాన్ని గోపిరెడ్డి పక్కన పెట్టారు. దీంతో గోపిరెడ్డి, బ్రహ్మారెడ్డి వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ సారి గోపిరెడ్డికి టికెట్ రాకుండా చేసేందుకు బ్రహ్మారెడ్డి వర్గం అస్త్రాలు సిద్ధం చేసుకుని యుద్ధానికి రెడీ అయ్యింది.

అధిష్టానం ఎవరి వైపు మొగ్గు

గోపిరెడ్డి పుణ్యమాని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చోటామోటా నాయకులు, పార్టీకి పరోక్షంగా మద్దతు తెలిపే కీలక వ్యక్తులు, కార్యకర్తలు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోపిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న వీరంతా బ్రహ్మా రెడ్డికి మద్దతుగా తమ గ్రామాలకు ఆహ్వానించి ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డి వర్గం ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసింది. గోపిరెడ్డి వర్గం మాత్రం తమ నాయకుడికే టికెట్ ఖరారైందని ప్రచారం ప్రారంభించింది. ఇక్కడి పరిస్థితులపై ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నరసరావుపేట సీటు విషయం రాజ్యసభ ఎన్నికల తర్వాతే ఓ కొలిక్కి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం గోపిరెడ్డి వైపు మొగ్గు చూపుతుందో గజ్జెలకే ఓటు వేస్తుందో వేచి చూడాలి.



Next Story