Gannavaram విధ్వంసంపై తీవ్ర ఆగ్రహం.. చంద్రబాబు బహిరంగ లేఖ

by Disha Web Desk 16 |
Gannavaram విధ్వంసంపై తీవ్ర ఆగ్రహం.. చంద్రబాబు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే... ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ అని, గన్నవరం ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, పార్టీనేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారి ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్‌కు గురి చేసి....ఆ బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

వాస్తవాలపై చంద్రబాబు బహిరంగ లేఖ

అసలు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన వాస్తవాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు...బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందని పేర్కొన్నారు.

దారుణమైన ఘటనలు కోకొల్లలు

పన్నులపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారిందన్నారు. కొవిడ్ సమయంలో మాస్క్‌లు అడిగిన డా.సుధాకర్...మద్యంపై ప్రశ్నించిన ఓం ప్రతాప్‌ల ప్రాణాలు తీశారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. ఇలాంటి ఘటనలు ఈ పాలనలో కోకొల్లలని చంద్రబాబు బహిరంగ లేఖలో తెలిపారు.

అక్రమ కేసులతో జైలుపాల్జేస్తారా?

రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై ప్రజల్లో చైతన్యవంతం తీసుకువచ్చేందుకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుండటంతో భయపడిన ఈ ప్రభుత్వం అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించిందని లేఖలో తెలిపారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యిమందిపై అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆంక్షలు, నిర్భందాలు ఉన్నా అనపర్తిలో సభ విజయవంతం కావడంతో ఉలిక్కిపడిన జగన్ గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఈ నెల 20న గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారని చెప్పుకొచ్చారు.

దొంతు చిన్నాపై కక్ష సాధింపులు

స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ది స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నిస్తుండటంతో అతడిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే అతడి కారుకు నిప్పుపెట్టారని.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు ధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు తెలిపార. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా ఎస్పీ కనీసం స్పందించలేదన్నారు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్‌లలో రికార్డు అయినప్పటికీ బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని చంద్రబాబు చెప్పా. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు జైలు పాలు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

సొంత రాజ్యాంగంతో పాలిస్తున్న జగన్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పథకం ప్రకారమే దాడులకు పురికొల్పారని చంద్రబాబు ఆరోపించారు. వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ది స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నాడని ఆయన చెప్పారు. ప్రజల నుంచి రూ.1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో రంగా నిందితుడు అని పేర్కొన్నారు. నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శనమైన సీఎం వైఎస్ జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాడని ధ్వజమెత్తారు.

ప్రభుత్వమే సృష్టిస్తోంది..

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుందని మండిపడ్డారు. ఇందులో కొంతమంది కళంకిత పోలీసు అధికారులు భాగస్వాములు కావడం విచారకరకరమన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గాని, కార్యకర్తలు గాని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు గాని వీటికి భయపడే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 40 ఏళ్లుగా పార్టీని ఆదరించిన ప్రజలను కాపాడుకోవడం కోసం, బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి...ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని బహిరంగ లేఖలో తెలిపారు.

దేనికైనా సిద్ధమే..

ఇందుకోసం ఏ స్ధాయి పోరాటానికి అయినా తాను సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి, ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందని, ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే అని చంద్రబాబు తెలిపారు. 'ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందాం. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. మన భవిష్యత్‌ని... మన బిడ్డల భవిష్యత్‌ని కాపాడుకుందాం'. అని చంద్రబాబు బహిరంగ లేఖలో కోరారు.



Next Story

Most Viewed