Ap News: రూ.175 కోట్లు వృధా చేశారు

by Disha Web Desk 16 |
Ap News: రూ.175 కోట్లు వృధా చేశారు
X

దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖ పెట్టుబడుల సమ్మిట్ అంతా అంకెల గారడీ అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గతంలో ఎప్పుడో చేసుకున్న ఒప్పందాలకు ఇప్పుడు ఎంవోయూలు చూపిస్తున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పలు పార్టీల కార్యకర్తలు, నేతలు జనసేన పార్టీలో చేరారు. అనంతం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ విశాఖ పెట్టుబడుల సదస్సుపై స్పందించారు.

యువతను మభ్యపెట్టే విధంగా సమ్మిట్

వైజాగ్‌లో రెండు రోజులు పాటు జరిగిన పెట్టుబడుల సమావేశాలు యువతను మభ్యపెట్టే విధంగా ఉన్నాయన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు సుమారు రూ.175 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారని ఆరోపించారు. కోడిగుడ్లను కూడా సీఫుడ్‌లో కలిపేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతో రెండున్నర సంవత్సరాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎంవోయూ చేసిందని, దీని వెనుక పరమార్థం ఏమిటో ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. రాజధాని లేని రాష్ట్రం, నాయకత్వం లేని ముఖ్యమంత్రి, ఇది ప్రస్తుత పరిస్థితి అంటూ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఐటీ ఎగుమతుల్లో మన రాష్ట్రం దేశంలోనే అతి తక్కువ స్థానంలో ఉందని.. పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అంకెల గారడీలను తలపిస్తోందని విమర్శలు గుప్పించారు. రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చేసిన హడావిడి అంతా మోసపూరితమేనని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed