ఏపీలో కరోనా కేసులు: సీఎం జగన్ సమీక్ష..కీలక ఆదేశాలు

by Disha Web Desk 21 |
ఏపీలో కరోనా కేసులు: సీఎం జగన్ సమీక్ష..కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీగా కేసులు సైతం నమోదు అవుతున్నాయి. ఏపీలోనూ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 3 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు సమీక్షలో తెలిపారు. అయితే ఈ కేసులు కొత్త కొవిడ్ వేరియంట్‌ వా? లేక పాత కేసులేనా? అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. మరోవైపు కొవిడ్ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జేఎన్-1పట్ల ముందస్తు జాగ్రత్తలపై చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో వైద్యఆరోగ్యశాఖతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

అప్రమత్తత అవసరం: సీఎం జగన్

కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 ఎంతో వేగంగా విస్తరిస్తోందని.. ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి అని సూచించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలి అని తెలిపారు. కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి అని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

అలర్ట్‌గా ఉన్నామన్న అధికారులు

కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉన్నతాధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని చెప్పుకొచ్చారు. జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కొవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని చెప్పారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేశారు.

అందుబాటులోకి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. అంతేకాదు ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని... ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని అన్నారు. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.


Next Story

Most Viewed