మోటార్లకు మీటర్లపై ఒక్క రూపాయి తీసుకోబోం: సీఎం జగన్

by Disha Web Desk 22 |
మోటార్లకు మీటర్లపై ఒక్క రూపాయి తీసుకోబోం: సీఎం జగన్
X

దిశ, ఏపీబ్యూరో : మోటార్లకు మీటర్ల విషయంలో టీడీపీతోపాటు విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా కోరారు. మోటార్లకు మీటర్లు విషయంలో రైతుల నుంచి ఒక్క రూపాయి తీసుకోమని క్లారిటీ ఇచ్చారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని.. మోటార్లకు మీటర్ల వల్ల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ప్రకటించారు. మోటార్లు కాలిపోయే స్థితి నుంచి రైతులను కాపాడుతామని హామీ ఇచ్చారు. క్వాలిటీ అనేది లేకపోతే రైతు నష్టపోతాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బుధవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలియజేశారు. రాష్ట్రంలో 10,775 ఆర్బీకేలను ఏర్పాటు చేశామని ఈ విధానాన్ని నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ ప్రశంసించాయని గుర్తుచేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని.. మన పాలనలో ఒక్క మండలంలోనూ కరవు లేదని, ఈ మూడేళ్లలో సీమకు అత్యధికంగా నీళ్లు ఇచ్చామని సీఎం జగన్ వివరించారు.

మేనిఫెస్టోలో 98.4శాతం హామీలు అమలు చేశాం

'రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తే.. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20.45 లక్షల మంది రైతులకు రూ.1,795 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించడంతోపాటు.. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఒక్క పథకానికే మూడేళ్లలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ మార్చి నుంచి సాయిల్ డాక్టర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం, విత్తనాల సేకరణలో గత ప్రభుత్వ బకాయిలనూ చెల్లించాం. రైతుల సహకారంతో ఏపీలో పంట ప్రణాళిక అమలవుతోంది. గత ప్రభుత్వాల హయాంలో చనిపోయిన 473 రైతు కుటుంబాలకు మేం వచ్చాకే పరిహారం అందించాం. మూడేళ్లలో మరణించిన 308 మంది రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం అందించాం. పాసు పుస్తకం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం అని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామస్ధాయిలోనే ప్రతి రైతన్నకు కూడా మార్పు కనిపించే విధంగా ఆర్బీకేలు చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం, గొప్ప విప్లవాత్మక మార్పు మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగింది. మేనిఫెస్టో హామీల్లో 98.4 శాతం హామీలను మూడున్నరేళ్లకు ముందే అమలు చేసిన, చేస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ తెలిపారు.

కరువు-చంద్రబాబు కవలలు

'చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే. 2014లో 238, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018లో 347 మండలాలను కరవు మండలాను ఖరీప్‌లో ప్రకటిస్తే 2019లో ఆయన దిగిపోయిన ఏడాదిలో రబీలో 257 మండలాలను ప్రకటించారు. అందుకే చంద్రబాబు నాయుడు పాలన గురించి ఒక నానుడి కూడా ఉంది. కరువు–చంద్రబాబు కవలలు అనేది నానుడి. ప్రస్తుతం మనపాలనలో సెప్టెంబర్‌ రెండో వారంలో కూడా పుష్కలంగా నీరు ఉంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, దొరువులు, కాల్వలు, వాగులు, వంకలు, నదులు ఇలా అంతటా నీరు కనిపిస్తోంది.

రాష్ట్రంలోని ఐదు ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా అన్నీ కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా గోదావరి డెల్టాలతో పాటు, రాయలసీమకు అత్యధికంగా సాగునీటిని అందించాం. మరోవైపు ఆహార ధాన్యాల దిగుబడిలో కూడా గడచిన మూడేళ్ళ కాలంలో రికార్డు స్థాయి దిగుబడి వచ్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 13.29 లక్షల టన్నులు పెరిగింది. చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు అయితే వైసీపీ పాలనలో మొదటి మూడేళ్లలో సగటున 167.24 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతుపక్షపాత ప్రభుత్వంగా ఈ 40 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం రైతన్నల కోసం వ్యవసాయ రంగంలో చేసిన ఖర్చు రూ.1,28,634 కోట్లు' అని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.

వైఎస్ఆర్ రైతు భరోసా– పీఎం కిసాన్‌

'ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 12,500 చొప్పున రైతు కుటుంబాలకు నాలుగేళ్ళలో రూ. 50,000 ఇస్తాం అని చెప్పాం. ఇచ్చిన హామీకన్నా మిన్నగా, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 సహాయంగా అందిస్తున్నాం. రైతులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పత్రాలు పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు, ఆలయాల భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా మనందరి ప్రభుత్వం ఏటా పెట్టుబడి సాయం చేస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో వరసగా నాలుగో ఏడాది, ఈ ఖరీఫ్‌ సీజన్‌లో తొలి విడత సహాయం కూడా చేశాం. అక్టోబరులో రెండో విడత సహాయం కూడా అందజేస్తున్నాం. రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయంగా రూ.23,875.29 కోట్లు చెల్లించినట్లు' సీఎం జగన్ వెల్లడించారు.

ఉచితంగా పంట బీమా

మన రైతన్న తన పంటను బీమా చేసుకోవాలంటే ఒక్క రూపాయి కూడా తన చేతినుంచి చెల్లించాల్సిన అవసరం లేకుండా, మొత్తం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే.

అంతేకాదు ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి మళ్ళీ ఆ సీజన్‌ ప్రారంభం అయ్యేలోపే పరిహారం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే అని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇ–క్రాప్‌లో నమోదు చేసుకుని, లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు, మన ప్రభుత్వం ఆ వడ్డీ భారాన్ని తానే మోస్తోంది. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీ పథకానికి కూడా నీళ్లొదిలారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి పూర్తి పరిహారం అందాలి. అదీ సకాలంలో అందాలి. ఇదే మనందరి ప్రభుత్వ విధానం. అలా అందకపోతే అది వృధా అవుతుంది. రైతుకు ఉపయోగపడదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో కంటే పూర్తి భిన్నంగా, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లించే గొప్ప విప్లవాత్మక మార్పు మన హయాంలోనే జరిగింది అని సీఎం జగన్ తెలిపారు.

రైతన్న నేస్తాలుగా ఆర్బీకేలు

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో 24,424 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లోమా చేసిన ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో వీరు గ్రామ వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన సహాయకుడు, పట్టు పరిశ్రమ సహాయకుడు, పశు సంవర్థక సహాయకుడు, మత్స్య సహాయకుడుగాను పనిచేస్తున్నారు. వీరందరితో పాటు ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్లు కూడా పని చేస్తున్నారు. నీతీ ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, ఎఫ్‌యేవో( పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) లాంటి ప్రముఖ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు అడుగడుగునా రైతుకు అండగా ఉండేందుకు మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతన్న నేస్తాలు ఈ ఆర్‌బీకేలు. ప్రభుత్వం సర్టిఫై చేసినవిత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోపాటు రైతు కోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములన్నీ, గ్రామాలలో ఇ–క్రాప్‌ ద్వారానే ఆర్‌బీకేల నుంచి రైతులకు చేరుతున్నాయి అని సీఎం జగన్ వెల్లడించారు.

అంతేకాదు వివిధ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం వైఎస్ఆర్ ఆగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు తీసుకొచ్చాం. ఈ ల్యాబ్‌లు రైతులు మోసపోకుండా టెస్టింగ్‌ ఆర్బీకేల నుంచి మొదలుపెడితే గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 ల్యాబ్‌లు, పూర్వపు జిల్లా స్థాయిలో 13, మరో 4 రీజినల్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. 147 అసంబ్లీ నియోజవర్గస్ధాయి ల్యాబ్‌లకు గానూ ఇప్పటికే 70 నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తున్నాయి. మిగిలినవి ఈ డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. రైతులు సాగు ఖర్చు తగ్గించుకునేందుకు, తద్వారా నికర ఆదాయం పెంచుకునేందుకు వ్యవసాయ యంత్రీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఆర్బీకేను యూనిట్‌ కింద తీసుకుని ప్రతి ఆర్బీకేను కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులతో కూడిన ఒక గ్రూపునకు ఈయంత్రాలను అప్పగిస్తారు. యంత్రాలను 40 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులు ఇవ్వడం, మరో 50 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు కేవలం 10 శాతం రైతులు పెడితే యంత్రసేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ దిశలోనే వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులు వారు వాడుకోవడమే కాకుండా ఆ ఆర్బీకే పరిధిలో తక్కువ అద్దె (బాడుగ)కు ఇచ్చే విధంగా 'వైయస్సార్‌ యంత్రసేవా పథకం' మొదలు పెట్టాం అని సీఎం జగన్ తెలిపారు.

ఆర్బీకేల పరిధిలో కిసాన్‌ డ్రోన్లు

కిసాన్‌ డ్రోన్లు కూడా ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పరిజ్ఞానంలో రైతులను ప్రోత్సహించాలని మనందరి ప్రభుత్వం నిర్ణయించింది. కిసాన్‌ డ్రోన్లతో పురుగు మందులు పిచ్‌కారీ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్‌ చేయొచ్చు. అలాగే పురుగు మందు వినియోగాన్ని కూడా తగ్గించగలుగుతాం. ఈ ఏడాది తొలిసారిగా 2 వేల డ్రోన్లతో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఒక్కో డ్రోన్‌ ఖర్చు దాదాపు రూ.10 లక్షలు అవుతుంది. వీటిని 2వేల ఆర్బీకేల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉచిత విద్యుత్‌ గతంలో లేని విధంగా జరుగుతోంది. పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తు్న్నాం. మరోవైపు రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంతగా నష్టపోతాడో మనందరికీ తెలిసి విషయమే.

దీనికోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆర్బీకే స్ధాయిలోనే సీఎంయాప్‌ ఉంది. సీఎంయాప్‌ అంట్‌ కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి పంటకు కూడా ఏది గిట్టుబాటు ధర అనే పోస్టర్‌ ఉంటుంది. దానికన్నా పంటకు రేటు తగ్గిపోతే అక్కడున్న విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ యాక్టివేట్‌ అయి మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు, జేసీకు నివేదిస్తాడు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ పద్దతి ప్రకారం విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేలు చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమానికి అడుగులు వేశాం అని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తెలిపారు.

అన్నదాత మరణిస్తే ఆదుకుంటున్నాం

పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు, సీసీఆర్సీ సర్టిఫికేట్‌ ఉన్న ప్రతి కౌలుదారుడికీ పొరపాటున వారు చనిపోయిన తర్వాత రూ.7 లక్షలు పరిహారం అందని కుటుంబం కనీసం ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది. అంత పారదర్శకంగా ఆర్బీకేలు స్పందిస్తున్నాయి. కలెక్టర్లు దగ్గర రూ.1 కోటి ఇంప్రెస్‌ అమౌంట్‌ కూడా పెట్టాం. నష్టం జరిగిన వెంటనే కలెక్టర్లు అప్పటికప్పుడు ఇచ్చే గొప్ప సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో చంద్రబాబు హాయాంలో 473 మంది రైతులు రూ.5 లక్షల పరిహరం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రైతులు చనిపోతే పట్టించుకోలేదు. 473 కుటంబాల వారికి కూడా రూ.5 లక్షల పరిహారం కింద రూ.23.65 కోట్ల పరిహారం మనందరి ప్రభుత్వం ఇచ్చింది. గతంలో రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ఒప్పుకుంటే పరిహారం ఇవ్వాల్సి వస్తుందేమోనని, లేదా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆత్మహత్యలను అక్నాలెడ్జ్‌ కూడా గత ప్రభుత్వం చేయలేదు.

2019 జూన్‌ 1 నుంచి డిసెంబరు 31 వరకు బలవన్మరణాలకు పాల్పడిన 308 రైతుల కుటుంబాలకు మనందర ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21.56 కోట్ల పరిహారం అందజేసింది. ఆ క్రమంలోనే 2020లో 260 రైతుల కుటుంబాలకు కూడా రూ.7 లక్షల చొప్పున రూ.18.20 కోట్ల పరిహారం ఇవ్వడం జరిగింది. 2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ సంవత్సరంలో 126 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, వారి కుటుంబాలకు కూడా రూ.7 లక్షల చొప్పున రూ.8.82 కోట్లు పరిహారంగా ఇచ్చాం. ఇలా, రైతుల కుటుంబాలకు మొత్తం రూ.72.145 కోట్ల పరిహారం ఇవ్వడం జరిగింది. ఇక 2021–22 ఏడాదిలో ఇందు కోసం రూ.20 కోట్లు కేటాయించగా, అందులో నుంచి రూ.15.345 కోట్లు రైతుల కుటుంబాలకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. కౌలు రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మానవతాదృక్పధంతో వ్యవహరించడం మొదలు పెట్టింది.

అలాగే కౌలు రైతులకు కూడా అన్ని ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో 'పంటల సాగుదారుల హక్కు చట్టం' (సీసీఆర్‌ఏ)ని మనందరి ప్రభుత్వమే తీసుకువచ్చింది. అలాగూ రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించే లక్ష్యంతో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం అని సీఎం జగన్ తెలిపారు. మొత్తం 1.14 లక్షల రైతులు, నిపుణులు సలహా మండళ్లలో సభ్యులుగా ఉన్నారు అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed