అదే ధీమా!

by Disha Web Desk 12 |
అదే ధీమా!
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ కమిటీల వరకు పార్టీ నిర్మాణం పూర్తి కాగానే సెప్టెంబర్ రెండో వారం నుంచి బస్సు యాత్రలకు వైసీపీ సిద్దమవుతోంది. సంక్షేమ పథకాల ప్రచారం తో పాటు గత టీడీపీ ప్రభుత్వాన్ని వైసీపీ సర్కారుతో పోల్చి ఎంత మేలు జరుగుతున్నదో గుర్తించాలని ప్రజలకు వద్దకు వెళ్లనున్నారు. టీడీపీ హయాంలో విద్య, వైద్యం ప్రజలకు తలకు మించిన భారమైతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు కింద ప్రభుత్వ బడులను ఎలా దీర్చిదిద్దామనే అంశంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గ్రామీణ మహిళల ఉపాధికి చేయూత, ఆసరా, స్త్రీనిధి పథకాలతో జగనన్న మార్టులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న తీరును వివరించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ కోసం గిడ్డంగుల నిర్మాణం పై ప్రచారం చేయనున్నారు. త్వరలో ఆర్బీకే కేంద్రాల్లోనే బ్యాంకు కార్యకలాపాలను విస్తరింపజేసి గిడ్డంగుల్లో రైతులు పెట్టుకున్న పంట మీద రుణాలు తీసుకునే ఏర్పాట్ల గురించి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

సచివాలయాల పనితీరు పై దృష్టి..

గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి సామాన్యులు వెళ్తే ఉద్యోగులు సరిగ్గా స్పందించే వాళ్ళు కాదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసే వారు. విపరీతమైన అధికార దర్పాన్ని ప్రదర్శించే వారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఎంతో మర్యాదగా చిరునవ్వుతో జనాన్ని రిసీవ్​ చేసుకుంటున్నారు. అక్కడ పనిచేసే ఉద్యోగులంతా ఈ మధ్యనే కొలువుల్లో చేరడం, అంతా ఉన్నత చదువుల నుంచి వచ్చినోళ్లు కావడంతో అవసరార్థం వచ్చే ప్రజలతో మమేకమవుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రజలకు మధ్య వాలంటీర్ల సేవలు అనుసంధానంగా ఉండడం వల్ల సగటు ప్రజలకు చాలా తిప్పలు తప్పాయి. ఇప్పుడు ప్రభుత్వం సచివాలయాల్లో 18 శాఖలకు సంబంధించిన సిబ్బందిని నియమించి ప్రజలకు మరింతగా చేరువ కావడానికి కసరత్తు చేస్తోంది.

ఉపాధి పెంచే దిశగా..

రానున్న ఎన్నికల్లో యువతకు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలకు వైసీపీ రూపకల్పన చేస్తోంది. ఈపాటికే ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్ల స్థాపనకు కార్యాచరణను అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.

గ్రామీణ ఆర్థికానికి జవసత్వాలు..

రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ప్రభుత్వమే బ్యాంకింగ్​ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించాలని యోచిస్తోంది. తద్వారా చేతి వృత్తులు, చిరు వ్యాపారులు, చిన్న మొత్తాలతో కుటీర పరిశ్రమలు, ఇతర ఉపాధి అవకాశాలను ప్రోత్సాహిస్తూ సూక్ష్మ రుణాలను అందించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి మేనిఫెస్టోలో ప్రకటించేందుకు పార్టీ బ్యాక్​ ఆఫీస్ లో కృషి జరుగుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story

Most Viewed