కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ సోదాలు: Kinjarapu Atchannaidu

by Disha Web Desk 21 |
కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ సోదాలు: Kinjarapu Atchannaidu
X

దిశ, డైనమిక్ బ్యూరో : మార్గదర్శి సంస్థపై జగన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా జగన్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. కర్ణాటకలో 109వ బ్రాంచ్ ప్రారంభం మార్గదర్శి నిజాయతీకి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ప్రజల అభిమానం పొందుతూ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న సంస్థను వేధింపులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. ‘మార్గదర్శి సంస్థ చందాదారుల నమ్మకం పొందింది. మార్గదర్శి అంటే నమ్మకం, నిజాయతీ, పారదర్శకత. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెల్లడించే వరకు మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది’ అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి రాత్రి వేళల్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తుండటం జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఈ విషయంపై న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు.

ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల విశ్వాసం, మన్ననలు పొందిన మార్గదర్శిని దెబ్బతీయలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సోదాలపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చందాదారులను అడ్డుకోవడం, సిబ్బందిని వేధింపులకు గురిచేయడం చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదులు, మచ్చ లేవు. చందాదారులు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోయినా సీఐడీ అధికారులే ఒత్తిడి చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండ్ కో అవినీతిని ఈనాడు పత్రికలో ఎండగడుతున్నందునే లొంగదీసుకునేందుకు మార్గదర్శిని ఎంచుకున్నారు అని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలి అని సూచించారు. ప్రశ్నిస్తున్న వారి నోరు నొక్కాలనే మీ కుటిల పన్నాగాలు నెరవేరబోవు. ఇప్పటికైనా మార్గదర్శి సంస్థపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి అని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.



Next Story