సీఎం కుమార్తె అయినా, డిప్యూటీ సీఎం అయినా శిక్ష తప్పదు: Somu Veerraju

by Disha Web Desk 16 |
సీఎం కుమార్తె అయినా, డిప్యూటీ సీఎం అయినా శిక్ష తప్పదు: Somu Veerraju
X

దిశ, తిరుపతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తెలంగాణ సీఎం కుమార్తె అయినా, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయినా చట్టం ముందు అందరూ ఒక్కటేనన్నారు. అవినీతితో అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో, చట్టంలోనూ శిక్ష తప్పదని హెచ్చరించారు.

తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్‌లో దిశ దశ ఉన్న ప్రభుత్వం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల మయంగా చేశారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి వచ్చే జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్తామని సోము వీర్రాజు ప్రకటించారు. దొంగ ఓట్లపై తాము ఫిర్యాదు చేశామని, డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకునే ప్రయత్నం జరుగుతుందని సోము వీర్రాజు మండిపడ్డారు.

తిరుమల క్షేత్రాన్ని ఆదాయ వనరులుగా మార్చేందుకు అధికారులు, ప్రభుత్వం చూస్తుందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం కోసం భక్తుల వసతి గదుల ధరలను పెంచిందని, తిరుమలలో భక్తులు ఎవరికీ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, పవిత్రత కూడా లేదని ధ్వజమెత్తారు. పెంచిన గదుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాక పోతే ఛలో తిరుపతి యాత్రను మళ్ళీ చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.


Next Story

Most Viewed