Visakha Capital తరలింపునకు రంగం సిద్ధం?.. సీఎం జగన్ ఇల్లు ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 16 |
Visakha Capital తరలింపునకు రంగం సిద్ధం?.. సీఎం జగన్ ఇల్లు ఎక్కడో  తెలుసా?
X
  • విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు
  • మార్చిలో సీఎం జగన్ గృహప్రవేశం
  • త్వరలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కూడా తరలింపు
  • సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

దిశ, డైనమిక్ బ్యూరో : మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగ్గేదేలే అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ వంటి రాజధానిని విభజనతో కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని అలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని సీఎం జగన్ చెప్తున్నారు. అమరావతిని చంపేందుకే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, అందుకే విశాఖ రాజధానిగా ప్రకటించారని ప్రతిపక్షాలు, విపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అన్ని పార్టీలు ఏకమై ముప్పేట దాడికి దిగుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ మనలను ఎవడురా ఆపేది అన్నట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇటీవలే దేశరాజధాని ఢిల్లీ సాక్షిగా విశాఖయే ఏపీ రాజధాని అని ప్రకటించారు. తాను కూడా త్వరలోనే షిఫ్ట్ కాబోతున్నామని ఇండస్ట్రిలిస్ట్స్ అంతా మళ్లీ విశాఖలో కలుద్దామని చెప్పేశారు. దీంతో ఉత్తరాంధ్రప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి షిఫ్ట్ అయిపోతానని ప్రకటించడంతో ఆయన నివాసం ఉండేందుకు ఇల్లును వెతికే పనిలో పడిందంట అధికార సిబ్బంది. అంతేకాదు జిల్లా యంత్రాంగం విశాఖకు రాజధాని తరలింపు పనుల మీద దృష్టి పెట్టిందట. అన్నీ కుదిరితే మార్చి చివరి వారంలో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీచ్ రోడ్డులోనే సీఎం జగన్ ఇల్లు?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి అధికారిక ఆదేశాలు అందకపోయినప్పటికీ మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. మార్చి చివరి వారంలో రాజధాని తరలింపు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుదామని ప్రకటించిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోని భవనాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే బీచ్ రోడ్డులో అనుకూలమైన ఇంటి కోసం అధికారులు జల్లెడపడుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 22, 23వ తేదీల్లో అన్ని అనుకూలించి సరైన ఇల్లు దొరికితే ముఖ్యమంత్రి గృహప్రవేశం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలు కూడా లేకపోలేదు.ఇటీవల విశాఖలో ఎంవీపీ న్యాయవిద్యా పరిషత్తు పక్క నుంచి విఎంఆర్ డిఏ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీంతో ఈ మార్గంలోనే సీఎం వైఎస్ జగన్ నివాసం ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఇల్లు వేటలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా తాము ఉండడానికి అనుకూలమైన బిల్డింగుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రులకు విశాఖలో నివాసాలు ఉన్నాయి. అయితే రాయలసీమ, ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులు అధికారిక నివాసాలకు సంబంధించి గాలింపు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఇప్పటికే అలర్ట్ అయ్యారట. విశాఖకు రాజధాని మారుతున్న నేపథ్యంలో తమ నివాసాల కోసం గాలింపు చర్యలు మెుదలు పెట్టేశారట. తెలిసిన అధికారులు, బంధువులు, పరిచయస్తుల ద్వారా ఇల్లు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖకు ఆర్బీఐ రీజినల్ కార్యాలయం

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రాంతీయ కార్యాలయాన్ని సైతం విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కూడా విశాఖలో ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండగా ఏపీకి తరలించలేదు. అయితే దాన్ని కాస్తా ఇప్పుడు విశాఖకు తరలించాలని నిర్ణయించింది. ఆర్బీఐ విశాఖనే ఎంచుకుని అక్కడ రీజనల్ ఆఫీస్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖకు ఆర్బీఐ ఆఫీస్ వస్తే అయిదు వందల మంది సిబ్బంది పని చేస్తారు. దీంతో ఆఫీస్‌తోపాటు అధికారుల నివాసాల కోసం జిల్లా కలెక్టర్‌తో కూడా ఆర్బీఐ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖలోని రుషికొండ కానీ మధురవాడలో కానీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాల‌యాని ఏర్పాటు చేయడానికి భవనాలను ఇచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు వచ్చినట్లు సమాచారం. అన్నీ కుదిరితే వీలైనంత త్వరలో విశాఖకు ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ తరలిరానుంది.

సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఇదిలా ఉంటే అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈనెల 23న విచారణ జరపాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో తీర్పు ఏవిధంగా వస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వైసీపీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతామని.. విశాఖ రాజధాని కాబోతుందని స్పష్టం చేశారని తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్ ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆరోపిస్తున్నాయి.

Next Story