చంద్రబాబు వ్యూహాత్మక మౌనం! సైలెంట్ వెనుక రహస్యమిదేనా?

by Disha Web Desk 4 |
చంద్రబాబు వ్యూహాత్మక మౌనం! సైలెంట్ వెనుక రహస్యమిదేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అపర చాణుక్యుడిగా అభివర్ణించేవారు. రాజకీయాల్లో సంక్షోభం ఎదురైతే బెంబేలెత్తి పోయి, పరిస్థితులకు లొంగిపోకుండా సమస్యలు చుట్టుముట్టినప్పుడు సమర్థంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు దిట్ట అని ఇప్పటికీ రాజకీయాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సమస్యల సుడిగుండాలను తట్టుకుని, ప్రత్యర్థులు పన్నే పద్మవ్యూహాలను ఛేదించి, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గతమెంతో ఘనం..వర్తమానం అయోమయం.. అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందిన చంద్రబాబు నేడు చీకటిలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రోజూ వార్తల్లో నిలిచే చంద్రబాబు ఇప్పుడు ఆన్ స్క్రీన్‌పై కానరావడం లేదు. అటు అసెంబ్లీ.. ఇటు శాసన మండలిలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నా... టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నా కనీసం చంద్రబాబు కిమ్మనకపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో చంద్రబాబు అజ్ఞాతవాసం చేస్తున్నారని అధికార పార్టీ విమర్శలు చేస్తుంటే... బాబు అదృశ్యం వెనుక వ్యూహం ఉందంటూ టీడీపీ సమర్థించుకుంటున్నది. మరి చంద్రబాబు అజ్ఞాతంలో ఉండి ఏం చేస్తున్నారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

జగన్‌ను ఢీకొట్టలేకపోతున్న చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చంద్రబాబు రాజకీయ చాణుక్యుడు అని.. మంచి అడ్మినిస్ట్రేటర్ అంటూ రకరకాలుగా పిలిచేవారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కొత్త తరం నేతలతో సైతం సమానంగా పోటీ పడుతూ రాజకీయం చేయడంలో దిట్ట. 1995లో ఆగస్టు సంక్షోభం నుంచి నేటి వరకు చంద్రబాబు రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రధానులను డిసైడ్ చేసే విషయంలో తన ప్రమేయం కూడా ఉండేలా ఎదిగారంటే ఆయన రాజకీయ అకుంఠితకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2004 నుంచి 2014 ఎన్నికల వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోలేదు. అధికారమే పరమావధిగా వ్యూహాలు రచించారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. దీంతో 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అయితే 2004కంటే ముందు ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబుకు చాలా వ్యత్యాసం కనిపించింది. నాటి రాజకీయ చతురత కొరవడింది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకే కేంద్రంతో తెగదెంపులు తెంచేసుకుని చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. ఒంటరిగా ఎదురీదారు. కొంతమంది పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయకత్వానికి పరీక్షగా మారాయి. వెరసి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కేవలం 23 చోట్ల గెలుపొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందరో నాయకులను ఢీకొట్టిన చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ను ఢీ కొట్టడం సాధ్యపడటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నా కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు కాస్త విఫలమయ్యారనే చెప్పాలి. మరోవైపు క్యాడర్ సహకరించకపోవడం... కేసులకు భయపడి పార్టీని పట్టించుకోకపోవడం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం అని చంద్రబాబు ధీమాగా చెప్తున్నా కానీ అక్కడి పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అజ్ఞాతంలోకి వెళ్లారా?

చంద్రబాబుకు నిత్యం ప్రజల్లో ఉండటం చాలా ఇష్టం. కచ్చితంగా ప్రెస్‌మీట్ పెట్టడం లేదా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించడం వంటివి చేస్తూనే ఉంటారు. ప్రజల్లోకి వెళ్లేందుకు.. ఇతర పార్టీలను ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు వదలిపెట్టరనేది బహిరంగ రహస్యం. అలాంటి చంద్రబాబు వారం రోజులుగా సైలెంట్ అయిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ట్విటర్‌లో నేనున్నానంటూ ఓ మెరుపు మెరిపిస్తున్నారు. ఆయన బయటకు వచ్చి కనబడటం లేదు. దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ జూమ్, లేదా టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతోనూ... పార్టీ నేతలతోనూ మమేకమయ్యేవారు. కానీ అలాంటి పరిస్థితి నేడు కనిపించడం లేదు. ఇటీవలే జంగారెడ్డిగూడెంలోని సారా మరణాల బాధితులను పరామర్శించిన చంద్రబాబు అనంతరం అదృశ్యమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మరణాలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు అటు శాసన సభ, ఇటు శాసన మండలిలో చర్చకు పట్టుబడుతున్నాయి. ఇదే తరుణంలో టీడీపీ సభ్యులపై అటు మండలిలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ సస్పెన్షన్ వేటు పడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సభ్యులు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. అయితే కనీసం ఆ అంశంపైనా సభలో చర్చ జరగలేదు. తిరిగి వైసీపీ సభ్యులే టీడీపీ సభ్యులపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. సభలో ఇంతలా జరుగుతున్నా కనీసం చంద్రబాబు ఉ...అని కానీ ఊఊ అని కానీ అనకపోవడం చూస్తుంటే చంద్రబాబు ఎందుకిలా మౌనంగా ఉన్నారనే సందేహం అందరిలోనూ నెలకొంది.

వచ్చే ఎన్నికల కోసం రహస్య వ్యూహం

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అంటే టీడీపీకి అంత ఈజీ కాదు. కచ్చితంగా వేరే పార్టీ సహకారం లేకపోతే అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా వైసీపీ ఓడిపోవడం ఖాయమనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అందుకు చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతోనే పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటామని కూడా స్నేహహస్తం అందించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు పొత్తులు పెట్టుకోవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 2024 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 2014 కాంబో వచ్చే ఎన్నికల్లో రిపీట్ కాబోతుందని అందుకే చంద్రబాబు తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తుపెట్టుకుంటే బీజేపీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని ఒప్పించే పనిలో చంద్రబాబు పడ్డారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed