జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

by Dishafeatures2 |
జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. దీని కోసం కొత్తగా రాజకీయ తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పొత్తులకు సంబంధించి ఎప్పుడో తీర్మానం చేసేశామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జీవీఎల్ నర్సింహారావు మీడియాతో మాట్లాడారు. బీజేపీపై దుష్ప్రచారం చేసి ప్రజల్లో చెడు చేసేలా తప్పుడు విధానాల అవలంబిస్తే అంతకు అంత అనుభవించక తప్పదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు శాపనార్థాలు పెట్టారు. బీజేపీని కుట్రపూరితంగా బలహీనపరిచే రాజకీయాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. 2014 తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు.. ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని, అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశాయని జీవీఎల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో వారి స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు వారసత్వ రాజకీయ పార్టీలు.. అవినీతి పార్టీలేనని ఆరోపించారు. వీటికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి ఆధారంగా రాష్ట్రంలో బలపడాలని స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలతో సమానంగా గత ప్రభుత్వం టీడీపీ కూడా ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చూస్తే ఈసారి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తేవడానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ చేస్తున్నట్లు వెల్లడించారు.




Next Story

Most Viewed