AP | విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యార్థి మిత్ర కిట్లకు లైన్ క్లియర్

by Thanuru Gopichand |

సామాజిక సమానత్వం, నాణ్యమైన విద్యే లక్ష్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.

AP | విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యార్థి మిత్ర కిట్లకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలో భాగంగా మరో నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (Sarvepalli Radha Krishnan VIdyarthi Mitra) కిట్లు పంపిణీ చేసేందుకు మరో ముందడుగు వేసింది. కిట్లను సేకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులను జారీ చేశారు. రూ.830.04 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కిట్ల పంపిణీ కోసం రూ.157.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా చేయాలని, పంపిణీదారులను నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు

సామాజిక సమానత్వం, నాణ్యమైన విద్యే లక్ష్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్ల పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పాఠశాల సామాగ్రిని ఒకేసారి, ఒకే నాణ్యతతో అందించనుంది. తద్వారా పేద, ధనిక విద్యార్థుల మధ్య వ్యత్యాసాలను తగ్గించి, విద్యారంగంలో సమానత్వాన్ని సాధించడానికి కృషి చేస్తోంది. ప్రతి కిట్‌లో సుమారు రూ. 2,279 విలువైన వస్తువులు ఉంటాయని, 35 లక్షల మందికి పైగా విద్యార్థులకు కిట్‌లను అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ కిట్‌లో మూడు జతల యూనిఫాం క్లాత్ (కుట్టు కూలితో సహా), పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఒక స్కూల్ బ్యాగ్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, డిక్షనరీ వంటి ముఖ్యమైన వస్తువులు ఉండనున్నాయి. ముఖ్యంగా యూనిఫామ్‌ల నాణ్యత, సరైన సమయానికి పంపిణీ జరిగేలా చూడడానికి ప్రభుత్వం మొబైల్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను, జీపీఎస్ ఆధారిత సరకు ట్రాకింగ్‌ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ద్వారా మూడు దశల్లో కఠినమైన తనిఖీలను కూడా నిర్వహించనుంది. మైనారిటీ భాషా విద్యార్థుల కోసం తమిళం, ఒడియా, ఉర్దూ వంటి భాషల్లో ప్రత్యేక నిఘంటువులను అందించడం ఈ పథకంలో మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

​ఈ 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు' పంపిణీ కార్యక్రమం విద్యాసంవత్సరం మొదటి రోజు నుంచే పిల్లలు అన్ని వస్తువులతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు, డ్రాప్-అవుట్ శాతం తగ్గడమే కాకుండా ఈ పథకం పేద కుటుంబాలపై ఉండే ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీ విషయంలో నాణ్యతపై కొన్ని రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ సకాలంలో నాణ్యమైన విద్య సామాగ్రిని అందించడం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటు, రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. విద్యామిత్ర కిట్ల ద్వారా ప్రతి విద్యార్థికి సమానమైన, గౌరవప్రదమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Next Story