AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-23 10:30:33  IST  )

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పలు చారిత్రాత్మక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. రిటైర్మెంట్ కాలంలో భద్రత కల్పించే ఈ నిర్ణయం ద్వారా ప్రతి ఉద్యోగికి సగటున దాదాపు రూ.3 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

రూ.34 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల కొత్త ఉద్యోగాలు

రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపన, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ద్వారా ప్రతిపాదించిన దాదాపు రూ.34 వేల కోట్ల భారీ పెట్టుబడుల స్థాపనకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిశ్రమలు, ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్రంలో కొత్తగా 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రాజధాని, మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు

రాజధాని ప్రాంతంతో పాటు న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఉండవల్లి Undavalli) పరిసర ప్రాంతాలలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 426 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇక రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ శాశ్వత భవన నిర్మాణ పనుల కోసం రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story