ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు

by Disha Web Desk 21 |
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'జగనన్న గోరుముద్ద' పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పథకాన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు వర్తింపజేస్తామని తెలిపారు. వైఎస్ జగన్ నేతృత్వంలో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి కేవలం రూ.2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.6,268 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరంలో మరో రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed