మొదలైన ప్రలోభాలు.. రెండు పార్టీలలో కన్ఫ్యూజన్

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. ఉపఎన్నిక సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో అది బెడిసికొట్టింది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం అలాంటి అనుమానాలు వెంటాడుతున్నాయి. పార్టీలో 18 సంవత్సరాల పాటు పని చేయించుకున్న తర్వాత తనను బలవంతంగా బైటకు గెంటివేశారని, ఇప్పటికీ కారణాన్ని చెప్పడంలేదని ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఆయన పట్ల సానుభూతిగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో రకంగా ఉన్నది. ఈ సానుభూతి పవనాలపైనే ఈటల రాజేందర్ నమ్మకం పెట్టుకున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ ఇమేజ్‌ను, పార్టీ గుర్తింపును, ఏడేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతున్నది. దాదాపు ఐదు నెలల ప్రచారం ముమ్మరంగా జరిగి బుధవారం సాయంత్రం ముగిసినా ఇప్పటికీ ఏ పార్టీకీ గెలుపుపై స్పష్టత రాలేదు. గెలుస్తామన్న ధీమా రెండు పార్టీల్లోనూ లేదు. పైకి భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఫలితం వెలువడే వరకూ సస్పెన్స్ కొనసాగనున్నది. దీంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రచారం తర్వాత చోటుచేసుకునే ప్రలోభాల పర్వానికి తెర లేపాయి. టీఆర్ఎస్ స్థానిక కార్యకర్తలు ఒక్కో ఓటుకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం ఉదయం మొదలు పెట్టి రాత్రికల్లా పూర్తిచేస్తే బీజేపీ మాత్రం రెండు వేలు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంటున్నది.

ప్రజల్లోకి వెళ్ళిపోయిన సింపతీ

ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే బైటకు పంపిందనే వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఈటల లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్‌లో స్థానమెక్కడిదనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఉద్యమకాలం నుంచి నియోజకవర్గంలో పార్టీకి గుర్తింపు తెచ్చి పెట్టారని, ఇప్పుడు ఆయనను కుట్రపూరితంగానే సాగనంపారని, కేసీఆర్ చాలా మంది విషయంలో ఇదే చేశారని కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సానుభూతి పవనాలే ఇప్పుడు ఆయనకు గెలుపుపై ధీమా కలిగిస్తున్నాయి. ఈటల ఏ పార్టీకి చెందినవారైనా మద్దతు ఇస్తామని అంటున్నారు.

సరిగ్గా ఈ ప్రభావాన్ని గమనించిన టీఆర్ఎస్ నేతలు చివరి రెండు రోజుల్లో అద్భుతాలు చేయవచ్చని నోట్ల పంపిణీపై దృష్టి పెట్టారు. బీజేపీ సైతం ఇందుకు వెనకాడడంలేదు. ఈసారి ఎన్నికల ప్రచారం 72 గంటల ముందు ముగియడంతో ప్రచారం చివరి రోజునే ఉదయం నుంచి నోట్ల పంపిణీ ప్రారంభమైంది. సింపతీని ఈ విధంగా చల్లార్చవచ్చని టీఆర్ఎస్ భావిస్తున్నది. చివరి గంటల్లో మైండ్ సెట్ మార్చే నోటు ప్రభావాన్ని బీజేపీ కూడా వదులుకోకూడదని అనుకుంటున్నది. ఈటల రాజేందర్ మొదటి నుంచీ టీఆర్ఎస్ నోట్ల కార్యక్రమాన్ని షురూ చేస్తుందని ఆరోపించారు. గరిష్టంగా రూ. 20 వేలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కూడా ప్రచారంలోనే చెప్పారు. ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఆరు వేల రూపాయలతోనే సరిపెట్టిందనే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.

ప్రజల్లో క్లారిటీ

పార్టీతో సంబంధం లేకుండా పోటీ చేసే వ్యక్తిని చూసే ఓటు వేస్తామని ప్రజలు క్లారిటీగా చెప్తున్నారు. వరుసగా ఆరు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ఎలాంటి పనులు చేశారో తమకు స్వీయానుభవమని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామంటున్నారు. కానీ అదే సమయంలో అధికార పార్టీ తరఫున కాకుండా ప్రతిపక్ష పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున అనుకూలంగా ఓటు వేస్తే ఏమవుతుందో, ప్రతికూలంగా ఓటు వేస్తే ఏమవుతుందో కూడా స్పష్టతతో ఉన్నారు. ఎలాగూ ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక కేవలం రెండున్నర సంవత్సరాలకు మాత్రమేనని, ఈ కాలంలో గెలిచిన ఎమ్మెల్యే అటు అధికార పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్ష పార్టీకి చెందినవారైనా పెద్దగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టే అవకాశం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

వెంటాడుతున్న భయం

అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఏం జరుగుతుందోననే భయం చాలా మంది ఓటర్లను వెంటాడుతూ ఉన్నది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో లేవనెత్తిన సందేహాలే ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ తెరపైకి వచ్చాయి. అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్లయితే పింఛను, రేషను బియ్యం లాంటి పథకాలు ఆగిపోతాయన్న భయాందోళనలు వృద్ధులను వెంటాడుతున్నాయి. అయితే ఈ భయాలను గమనించిన బీజేపీ దుబ్బాక తరహాలోనే ఇవి ఆగిపోయే ప్రసక్తే ఉండదని, కొన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా అమలు చేస్తున్నవని, ఫండ్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయని ఓటర్లకు వివరిస్తున్నది. ఇక వ్యాపార వర్గాలకు మరో రకమైన భయం పుట్టింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు రంగంలోకి దిగుతారని, ఓటు పడకపోతే… అంటూ టీఆర్ఎస్ స్థానిక నేతలు చేస్తున్న హెచ్చరికలు సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నది.


Next Story

Most Viewed