రఫా పై దాడిని ఆపండి.. అమెరికా విదేశాంగ కార్యదర్శి

రఫా నగరంపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఈ దాడులను ఎలాగైనా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు.

Update: 2024-05-01 13:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రఫా నగరంపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఈ దాడులను ఎలాగైనా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. బుధవారం ఆంటోని, ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రఫా పై దాడిని ఆపేయాలని, ఇజ్రాయిల్-హామాస్ మధ్య సంధి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా వైఖరిని చర్చలలో పునరుద్ఘాటించారు. అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ, దక్షిణ గాజా నగరంలో ఆశ్రయం పొందుతున్న పౌరులకు సంబంధించిన భద్రతపై బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత మధ్యప్రాచ్యానికి బ్లింకెన్ ఏడవ సారి పర్యటించారు. బుధవారం ప్రధాని నెతన్యాహును జెరూసలేం కార్యాలయంలో కలిశారు. వీరిద్దరి మధ్య దాదాపు రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. సంధి ఒప్పందం కుదిరినా కూడా రఫాలోకి వెళ్లి దాడులు చేస్తామని మంగళవారం నెతన్యాహు ప్రతిజ్ఞ చేయడంతో ఇప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇజ్రాయిల్-హామాస్ మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని అమెరికాతో పాటు, ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా పౌరులకు చాలా నష్టం కలుగుతుందని, ఇప్పటికే మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినగా, అక్కడి సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తం అయిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇజ్రాయెల్ అధికారిక గణాంకాల ప్రకారం, ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి కారణంగా 1,170 మంది మరణించారు. అదే ఇజ్రాయెల్ ప్రతీకార దాడి కారణంగా గాజాలో దాదాపు 34,568 మంది మరణించారని, వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొంది


Similar News