ఇజ్రాయెల్ సైనికులను పట్టుకున్నాం.. హామాస్

ఇజ్రాయెల్-హామాస్ మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు

Update: 2024-05-26 03:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హామాస్ మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా ఉత్తర గాజాలోని జబాలియాలో శనివారం ఇరు పక్షాలు దాడులు చేసుకున్నాయి, ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులను పట్టుకున్నామని హామాస్ సాయుధ విభాగం ప్రతినిధి ఆదివారం తెలిపారు. అయితే ఎంతమందిని పట్టుకున్నారనే విషయాన్ని పేర్కొనలేదు, అలాగే ఎలాంటి రుజువులు కూడా చూపించలేదు. ఈ నేపథ్యంలో హామాస్ ప్రతినిధి చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. మా సైనికులు ఎవరు కూడా అపహరణకు గురైన ఘటన ఏదీ జరగలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పష్టం చేసినట్లు మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక సొరంగం లోపలికి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించాయని వారిపై అకస్మాత్తుగా దాడి చేసి తమ అదుపులోకి తీసుకున్నామని హామాస్ ప్రతినిధి చెప్పారు. హమాస్ ఒక వీడియోను విడుదల చేసింది, దానిలో రక్తం కారుతున్న వ్యక్తిని ఒక సొరంగంలో నేలపైకి లాగడం కనిపించింది. వీడియోలో సైనికుడు నీరసంగా, పక్కనే తుపాకీ కలిగి ఉన్నట్టు కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇరు పక్షాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్ మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ CIA అధిపతి, ఖతార్ ప్రధాన మంత్రిని కలిసిన తర్వాత కాల్పుల విరమణ చర్చల పునఃప్రారంభానికి తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు విషయం తెలిసిన ఒక అధికారి తెలిపారు.

ఇప్పటికే పలు దఫాలు జరిగిన చర్చలు కొంత మేరకు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. గాజాలో ఏడు నెలలకు పైగా యుద్ధం తర్వాత, మధ్యవర్తులు పురోగతిని సాధించడానికి చాలా కష్టపడ్డారు, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని, ఇరు పక్షాల మధ్య శాంతి వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Similar News