ఎంపీని హత్య చేయించింది స్నేహితుడే- బంగ్లాదేశ్ హోంమంత్రి వెల్లడి

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన ఓ వ్యక్తిని ముంబైలో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-05-25 12:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన ఓ వ్యక్తిని ముంబైలో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ హత్య చేయించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్న వేళ ఓ ముఖ్యమైన విషయం బయటికి వచ్చింది. ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడినే కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. ఎంపీ హత్యలో ఆయన స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ అక్తరుజ్జమాన్ షాహిన్ హస్తం ఉందని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసేందుకు భారత్, అమెరికాతో కలిసి బంగ్లాదేశ్ హోంశాఖ పనిచేస్తోందన్నారు. అమెరికాలో ఉన్న షాహిన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. హత్యకు గురైన ఎంపీ కుటుంబానికి న్యాయం జరిగేలా ఇంటర్ పోల్ సహా అన్ని ఏజెన్సీలను సంప్రదిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులకు క్రైం బ్యాగ్రౌండ్ ఉందన్నారు. హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి చెప్పారు.

Similar News