రుణం కోసం ప్రదక్షిణలు.. నిరుద్యోగుల వేడుకోలు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ) అమలు చేస్తోంది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కేవీఐసీతో పాటు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు(కేవీఐబీ), పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం ఏటా లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. […]

Update: 2021-05-07 21:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ) అమలు చేస్తోంది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కేవీఐసీతో పాటు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు(కేవీఐబీ), పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం ఏటా లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంపికైన వారికి రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్రం సబ్సిడీ రహిత రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. తయారీ, సేవా రంగాల్లో స్వయం ఉపాధిపై ఆసక్తి చూపుతూ రాష్ట్రం నుంచి ఏటా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, కరోనా మూలంగా గతేడాది నుంచి నోడల్ ఏజెన్సీకే అప్పగించారు. దరఖాస్తులను కేవీఐసీ, ఐడీసీ, కేవీఐబీ పరిశీలించి దరఖాస్తు దారులను ఎంపిక చేసి సబ్సిడీ విడుదలకు సుముఖత వ్యక్తం చేస్తూ మంజూరు ఉత్తర్వులు ఇస్తోంది. అయితే బ్యాంకర్లు మాత్రం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జోనల్ ఏజెన్సీ బ్యాంకర్లతో ఎన్నిమార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది. నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది.

కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఖచ్చితమైన ఆదేశాలు లేక పోవడంతో పథకం నీరుగారిపోతోంది. ప్రభుత్వం ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ ఇచ్చినప్పటికీ చేరుకోలేక పోతోంది. బ్యాంకుల కొర్రీలతో నిరుద్యోగులు సతమతమవుతున్నారు. దీనికి తోడు బ్యాంకర్స్‌తో సమీక్ష, సమావేశాలు లేవు. నిరుద్యోగులు అన్ని ధృవ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న బ్యాంకర్లు మాత్రం బ్యాంకుల చుట్టూ తప్పించుకుంటున్నారు.

దరఖాస్తుల వివరాలు..

ఖాదీ గ్రామీణపరిశ్రమలశాఖకు ఆన్ లైన్లో రుణం కోసం నిరుద్యోగులు 2016-17లో 6వేల మంది దరఖాస్తులు చేసుకోగా 1333 మంది ఎంపిక, 2017-18లో17,033 దరఖాస్తులు రాగా 3730 ఎంపిక, 2018-19లో 19,079 దరఖాస్తులు రాగా 4731 ఎంపిక, 2019-20లో 27,832 దరఖాస్తులుగా రాగా 6725 ఎంపిక, 2020-21లో 10 వేలకు పైగా రాగా 5109 దరఖాస్తులను ఎంపిక చేసి బ్యాంకులకు రుణం ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు నిరుద్యోగులకు ఇచ్చిన యూనిట్లు, కల్పించిన ఉద్యోగాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం..

యూనిట్ల టార్గెట్ ఉద్యోగాల టార్గెట్ ఇచ్చింది కల్పించిన ఉద్యోగాలు

2014-15 546 4368 207 1917
2015-16 239 1912 207 2155
2016-17 428 3424 290 3103
2017-18 697 5576 477 5505
2018-19 1305 10441 759 7412
2019-20 1424 11392 752 7139
2020-21 1029 8232 739 6560
==========================================================
మొత్తం 5668 45,345 3431 33791
==========================================================

రుణం కోసం ఎదురు చూస్తున్నా…

టెంట్ హౌజ్ కోసం 2019 డిసెంబర్‌లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన (ఖాదీ ) పథకం కింద రూ.10లక్షల రుణం కోసం దరఖాస్తు చేశా. ఈ పథకం కింద సబ్సిడీతో బ్యాంకు లోన్ వస్తుందని ఆశించా. ఇప్పటి వరకు అప్రూవల్ అయ్యిందా? రిజెక్ట్ అయ్యిందా? అని కూడా రిప్లయ్ లేదు. మండలంలోని ఓ బ్యాంకు దగ్గరికి వెళ్లి దరఖాస్తు చూపితే అప్రూవల్ రాలేదని చెబుతున్నారు. అలా కాకుండా ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరికి సబ్సిడీపై రుణం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – అజ్మీరా నరేష్, సూర్యతండా, నల్లేలా, కురవి, మహబూబాబాద్

బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు..

టిఫిన్ సెంటర్ పట్టుకుందామని 2019-20లో రూ.10లక్షల రుణం కోసం పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకున్న. అధికారులు దరఖాస్తును అప్రూవల్ చేశారు. బ్యాంకుఅధికారులు మాత్రం మాత్రం నిత్యం తిప్పుకుంటున్నారు కానీ రుణం మాత్రం ఇవ్వడం లేదు. ఫీల్డ్ ఆఫీసర్ కూడా సర్వే చేసిండు. బ్యాంకు మేనేజర్ ఏదో ఒకసాకు చెబుతుండు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – సంజు, బొప్పపూర్, దుబ్బాక, సిద్దిపేట

బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం

నిరుద్యోగులు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి బ్యాంకులకు అప్రోల్ చేస్తున్నాం. స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్రం పీఎంజీఈపీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తు దారులందరికి సబ్సిడీ రుణం ఇవ్వాలని బ్యాంకు వారికి సూచిస్తున్నాం. కానీ యూనిట్ల మంజూరీలో ఆలస్యమవుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. సమావేశంలో ఈ అంశంపై అధికారులతో మాట్లాడుతాం. లక్ష్యం చేరేలా చర్యలు తీసుకుంటాం. – సంతోష్, డిప్యూటీ డైరెక్టర్, పీఎంజీఈపీ

Tags:    

Similar News